Helicopter Crash: ప్రమోషన్‌ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు

10 Dec, 2021 08:57 IST|Sakshi

న్యూఢిల్లీ: జనరల్‌ బిపిన్‌ రావత్‌కు సహాయక సిబ్బందిగా ఏడాదికాలంగా విధుల్లో ఉన్న సెకండ్‌ జనరేషన్‌ ఆర్మీ అధికారి, బ్రిగేడియర్‌ లఖ్వీందర్‌ సింగ్‌ లిడ్డర్‌ పదోన్నతి అర్ధంతరంగా ఆగింది. బుధవారం హెలికాప్టర్‌లో రావత్‌తో పాటు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో లఖ్వీందర్‌ ఉన్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన లఖ్వీందర్‌ గతంలో కశ్మీర్‌లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో, చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. కజక్‌స్తాన్‌లో భారత సైనిక బృందంలో పనిచేశారు.

సేనా మెడల్, విశిష్ట్‌ సేవా మెడల్‌ ఆయనను వరించాయి. త్రివిధ దళాల విధుల్లో విశేష అనుభవముంది. దాంతో రావత్‌కు సహాయక సిబ్బందిలో డిఫెన్స్‌ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. సెకండ్‌ జనరేషన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే మేజర్‌ జనరల్‌ పదవిని కట్టబెట్టనున్నారు. ప్రమోషన్‌ జాబితాలో ఉన్న ఆయన ఆ పదోన్నతి పొందకుండానే వీరమరణం పొందారు. లఖ్వీందర్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. 
(చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్‌ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం)

విహార యాత్రకు తీసుకెళ్తామన్నారు 
హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన హవాల్దార్‌ సత్పాల్‌ రాయ్‌ సొంతూరు పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లా తక్దాలో విషాదం అలుముకుంది. రాయ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ‘చివరిసారిగా దీపావళికి వచ్చారు. ఏప్రిల్‌లో వస్తానని మాట ఇచ్చారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్తానన్నారు. ఇంతలో ఘోరం జరిగింది’ అని రాయ్‌ భార్య కన్నీటిపర్యంతమయ్యారు.

మరోవైపు, ప్రమాదంలో మరణించిన కో–పైలట్, స్క్వాడ్రన్‌ లీడర్‌ కుల్‌దీప్‌ సింగ్‌ అంత్యక్రియల ఏర్పాట్లు రాజస్తాన్‌లోని సొంతూరు ఘర్దానా ఖుర్ద్‌లో మొదలయ్యాయి. కాగా, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. 
(చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’)

31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టారు 
ఒక సోదరి ముంబైలో ఉండటంతో ఇన్నాళ్లూ కుదరక, ఎట్టకేలకు ముగ్గురు అక్కలతో కలసి 31 ఏళ్ల తర్వాత ఇటీవల రాఖీ పండుగ జరుపుకున్న తన కుమారుడు ఇప్పుడు లేడని, హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన వింగ్‌ కమాండర్‌ పృథ్వీ సింగ్‌ చౌహాన్‌ తండ్రి వాపోయారు. ఐదుగురు సంతానంలో ఇతనే చిన్నవాడని పృథ్వీ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పృథ్వీ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. పృథ్వీ 2000లో హైదరాబాద్‌లో భారత వాయుసేనలో చేరారు. 

మరిన్ని వార్తలు