‘ఉచితాల’తో ఆర్థిక వ్యవస్థకు చేటు..అఖిలపక్షాన్ని పిలవలేదేం?

25 Aug, 2022 04:37 IST|Sakshi

అధ్యయనానికి కేంద్రమే ఒక కమిటీని ఎందుకు నియమించకూడదు?  

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ 

వ్యాజ్యాలను ఇకపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణ  

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో నెగ్గడానికి రాజకీయ పార్టీలు ప్రజలకు ‘ఉచిత’ హామీలు ఇస్తుండడం తీవ్రమైన అంశమేనని, దీనిపై కచ్చితంగా చర్చ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. చర్చించడానికి అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలుపునివ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే ఉచితాల వ్యవహారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉచితాలపై పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇవి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌æ రవికుమార్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున‡ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ఉచితాలపై అధ్యయనం చేయడానికి నియమించే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లోధాను చైర్మన్‌గా నియమించాలని కోరారు. ‘‘పదవీ విరమణ చేసిన, చేయబోతున్న వ్యక్తికి ఈ దేశంలో విలువ లేదు’’ అంటూ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రతిస్పందించారు. కమిటీకి ఒక రాజ్యాంగ సంస్థ నేతృత్వం వహించాలని భావిస్తున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. ఈ సమస్యను అధ్యయనం చేయడానికి కేంద్రమే కమిటీని ఎందుకు నియమించకూడదని సీజేఐ ప్రశ్నించారు.  

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంతో మేలు  
ఎన్నికలకు ఆరు నెలల ముందు ఉచితాలు ప్రకటించడమే ప్రధానమైన సమస్య అని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. ఆయన ‘సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌’ తరఫున వాదనలు వినిపించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, పబ్లిక్‌ పాలసీని అపహాస్యం చేస్తూ ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులైన కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడం, ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు చేయడం.. ఈ మూడూ అక్రమమేనని చెప్పారు. పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు నిధుల మూలాలను సైతం వెల్లడించాలనే ప్రతిపాదనను సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యతిరేకించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన రికార్డులు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండవని గుర్తుచేశారు. ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని అమలు చేస్తే పరిష్కారం లభిస్తుందని, ఆర్థిక లోటు మూడు శాతానికి మించితే తదుపరి సంవత్సరం నుంచి కేటాయింపులు తగ్గించే అధికారం ఆర్థిక కమిషన్‌కు ఉందని తెలిపారు.  

పార్టీలు ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాయి  
ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారంలో లేని పార్టీలు హామీలు ఇస్తున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు ఉండవని ఒకరు ప్రజల్ని మభ్యపెట్టొచ్చు. కానీ, అధికారంలోకి వస్తే చంద్రుడిని తీసుకొస్తానని హామీ ఇవ్వగలమా?’’ అని ప్రశ్నించారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ఉచితాల అంశంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకని అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వలేదని అన్నారు. ఉచితాలపై నియంత్రణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంతో ఫలితం ఉండదని మెహతా బదులిచ్చారు. ఉచితాలు అందించడం తమ ప్రాథమిక హక్కుగా కొన్ని పార్టీలు భావిస్తున్నాయని, కేవలం ఉచితాల హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీలూ ఉన్నాయని ఉద్ఘాటించారు.  

నేను పోటీ చేస్తే..
‘‘కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేది పెద్ద సమస్య. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తాయి. వ్యక్తులు కాదు. ఒకవేళ నేను పోటీ చేస్తే 10 ఓట్లు కూడా రావు. ఎందుకంటే వ్యక్తులకు అంత ప్రాధాన్యం ఉండదు. ఇదే మన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారు తర్వాత అధికారంలోకి రావచ్చు’ అని జస్టిస్‌ రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... తుషార్‌ మెహతా వ్యాఖ్యలను వ్యతిరేకించారు.

కేవలం ఉచితాల ద్వారా ఓటర్లను ఆకర్శిస్తారనడం సరైంది కాదన్నారు. బంగారు చైన్లు ఇస్తామంటూ హామీలు ఇవ్వడాన్ని సంక్షేమంగా ఎలా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దాతర్‌ ప్రశ్నించారు. ఉచితాల వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి తగిన సమాచారం అందుబాటులో ఉందని వివరించారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ఉచిత హామీల విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై ఇకపై జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారిస్తుందని తెలిపారు. సుబ్రహ్మణ్యం వర్సెస్‌ తమిళనాడు కేసును పునఃపరిశీలించడానికి ధర్మాసనం ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు