వృద్ధుడి కోసం కదలిన బెంగళూరు వాసులు

27 Oct, 2020 16:19 IST|Sakshi

బెంగళూరు: మంచో, చెడో ఏదో ఒక రెస్పాన్స్‌ త్వరాగా రావాలంటే సోషల్‌ మీడియానే సరైన వేదిక. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు కొకొల్లలు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన బాబా కా దాబా కథనానికి ఎలాంటి స్పందన వచ్చిందో ప్రత్యక్షంగా చూశాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. పాపం ఎండలో రోడ్డు మీద కూర్చుని మొక్కలు అమ్ముకుంటున్న వృద్ధుడికి సాయం చేయాల్సిందిగా కోరుతూ చేసిన ట్వీట్‌ నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు, సిని ప్రముఖులను కూడా కదిలించింది. ఎండకు రోడ్డు మీద కూర్చున్న ఆ వ్యక్తి కోసం నెటిజనులు గొడుగు, టేబుల్‌, కుర్చి వంటివి ఏర్పాటు చేయడమే కాక అతడి దగ్గర మొక్కలు కొని మద్దతుగా నిలిస్తున్నారు. (చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో)

వివరాలు.. ట్విట్టర్‌ యూజర్‌ శుభమ్‌ జైన్‌999 అనే వ్యక్తి ఈ వృద్ధుడి గురించి ట్వీట్‌ చేశాడు. ‘కర్ణాటక సరక్కి సిగ్నల్‌ కనకపురి రోడ్డులో రేవన సిద్దప్ప అనే వ్యక్తి మొక్కలు అమ్ముకుంటున్నాడు. ఒక్కొ మొక్క ధర 10-30 రూపాయలు మాత్రమే. అతనికి సాయం చేయండి’ అంటూ వృద్ధుడికి సంబంధించి రెండు ఫోటోలను షేర్‌ చేశాడు. తక్కువ సమయంలోనే ఈ ట్వీట్‌ వేలాది లైక్స్‌ సంపాదించింది. నటుడు రణదీప్‌ హుడాని కూడా ఆకర్షించింది. దాంతో కరెక్ట్‌ అడ్రెస్‌ చెప్పాల్సిందిగా హుడా, శుభమ్‌ జైన్‌ని కోరాడు. అనంతరం సిద్దప్ప కరెక్ట్‌ అడ్రెస్‌ని ట్వీట్‌ చేస్తూ.. హే బెంగళూరు.. కొంత ప్రేమను చూపించు అంటూ వృద్ధుడికి మద్దతు ఇవ్వాల్సిందిగా తన అనుచరులను కోరారు రణదీప్‌ హుడా. అలానే నటుడు మాధవన్‌, ఆర్జే అలోక్‌ వంటి పలువురు ప్రముఖులు కూడా ఈ ట్వీట్‌ని రీట్వీట్‌ చేశారు. 

దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. చేంజ్‌ మేకర్స్‌ ఆఫ్‌ కనకపుర రోడ్‌ అనే ఎన్జీఓ సంస్థ, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమాఖ్య సిద్దప్పకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతడి కోసం ఓ గొడుకు, టేబుల్‌, కుర్జీతో పాటు అమ్మడానికి మరిన్ని మొక్కలు అందిచారు. 

మరిన్ని వార్తలు