ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హెరాయిన్‌ పట్టివేత..రూ.100 కోట్లకు పైగా

7 Oct, 2022 14:05 IST|Sakshi

ముంబై: ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి నిషేధిత మత్తుపదార్థం హెరాయిన్‌ను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆఫ్రికా దేశమైన మలాయ్‌ నుంచి వయా ఖత్తర్‌ దేశం మీదుగా ముంబైకి వస్తున్న ఓ ప్రయాణికుడు భారీ ఎత్తున హెరాయిన్‌ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు మంగళవారం విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి లగేజీలో సుమారు 16 కేజీల హెరాయిన్‌ బయటపడింది. అధికారులు దానిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా విచారణ నిమిత్తం అతడిని డీఆర్‌ఐ కస్టడీకి అనుమతినిచ్చింది.

కాగా, తనిఖీల్లో పట్టుబడ్డ హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మాదకద్రవ్యాన్ని డెలివరీ తీసుకునేందుకు ఢిల్లీలోని హోటల్‌ నుంచి వచ్చిన ఓ మహిళను కూడా అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఈమెను ఘనాకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కూడా డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.   
చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్‌ రైలు.. 24 గంటల్లోనే..

>
మరిన్ని వార్తలు