ఏం తెలివబ్బా.. మాస్క్‌తో హైటెక్‌ కాపీయింగ్‌

22 Mar, 2021 19:09 IST|Sakshi

పాట్నా: మహమ్మారి వైరస్‌ రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా వాడుతున్న మాస్క్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మాస్క్‌ ఉండడంతో ముఖం కనిపించదని భావించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు యువతులను కూడా మోసం చేస్తున్నారు. తాజాగా కొందరు ముందడుగు వేసి మాస్క్‌ చాటున హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. పోలీసుల తనిఖీల్లో వారి అతి తెలివితేటలు కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు.

బిహార్‌లో పోలీస్‌ నియామకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దానికి సంబంధించిన పరీక్షను ఆదివారం (మార్చి 21) నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు పరీక్ష రాయడానికి వచ్చారు. అయితే ఈ పరీక్షకు మాస్క్‌ తప్పనిసరి చేశారు. తనిఖీల సమయంలో మాస్క్‌లను పరీక్షించలేరని భావించి కొందరు ఈ ఎన్‌ 95 మాస్క్‌ ను అడ్డంగా పెట్టుకుని కొందరు హైటెక్‌ కాపీ చేసేందుకు ప్రయత్నించారు. 

బాబువా, హజీపూర్‌లో కూడా పరీక్షలు జరిగాయి. బాబువాలో విక్కీ కుమార్‌, యాదుపూర్‌లో నిరంజన్‌ కుమార్‌ మాస్క్‌ చాటున సిమ్‌ కార్డు, బ్లూటూత్‌, బ్యాటరీ తీసుకెళ్తున్నారు. తనిఖీల సమయంలో వీటిని అధికారులు గుర్తించి వెంటనే వారిని పోలీసులకు అప్పగించారు. మరోచోట విశాల్‌ కుమార్‌ కూడా ఇదే విధంగా మోసం చేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. వీరికి 20 కిలో మీటర్ల దూరంలోని కుద్రా నుంచి సమాధానాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితులు సమాచారం అందించడంతో సమాధానాలు ఇచ్చే వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సంతోశ్‌ కుమార్‌, దీపక్‌ కుమార్‌, అతుల్‌ పాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌, పప్రింటర్‌, సెల్‌ఫోన్లు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు బాబువా ఎస్పీ రాకేశ్‌ కుమార్‌, డీఎస్పీ సునీతా కుమారి తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వెనుక ఎవరు ఉన్నారనే దానిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. 

మరిన్ని వార్తలు