‘బుల్డోజర్‌ చర్య ఫ్యాషన్‌ అయింది’.. హైకోర్టు సీరియస్‌

12 Feb, 2024 16:36 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న బుల్డోజర్‌ చర్యను రాష్ట్ర హైకోర్టు  తీవ్రంగా  ఖండించింది. బుల్డోజర్‌ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్‌గా తయారైందని కోర్టు సీరియస్‌ అయింది.  ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ తప్పు పట్టింది. సరైన  విధానాలు అమలు పర్చకుండా  నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

నిందితుడు రాహుల్‌ లాంగ్రీ..  ఓ వ్యక్తి  వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్‌ లాంగ్రీ జైలులో  శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్‌ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్‌ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో  రాహుల్‌ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్‌ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్‌లో లోన్‌ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్‌లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్‌ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్‌దారులు సివిల్‌ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

చదవండి: బిహార్‌లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్‌

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega