MLC Kavitha-ED Investigation: తుగ్లక్‌ రోడ్‌లో హైడ్రామా

17 Mar, 2023 01:37 IST|Sakshi

ఈడీ ముందు హాజరు విషయంలో ఎమ్మెల్సీ కవిత మల్లగుల్లాలు 

మంత్రులు కేటీఆర్, హరీశ్‌ సహా న్యాయ నిపుణులతో విస్తృత చర్చలు 

ఉదయం 10 గంటలకు మీడియాతో మాట్లాడతారని తొలుత సమాచారం 

కానీ 11 దాటినా బయటికి రాని కవిత.. వ్యూహంలో మార్పు 

విచారణకు రాలేనంటూ న్యాయవాది ద్వారా ఈడీకి సమాచారం 

దీనితో ఈడీ ఏం చర్యలు తీసుకుంటుందనేదానిపై రోజంతా ఉత్కంఠ 

సీఎం కేసీఆర్‌ నివాసం, ఈడీ కార్యాలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండోసారి హాజరయ్యే విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. గురువారం విచారణలో ఆమెను అరె స్టు చేస్తారన్న ఊహాగానాలతో ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ నివాసం ఉన్న తుగ్లక్‌ రోడ్‌ ప్రాంతం, ఈడీ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు చోట్లా కవితకు సంఘీభావంగా వచ్చిన నేతలు, కార్యకర్తల హడావుడి, అదే సమయంలో కేంద్ర బలగాల మోహరింపు, జాతీయ మీడియా హడావుడితో రోజంతా ఉత్కంఠ కొనసాగింది. 

మంత్రులు, న్యాయ నిపుణులతో భేటీ 
బుధవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ తదితరులు గురువారం ఉదయం ఏడున్నరకే తుగ్లక్‌రోడ్‌లోని సీఎం నివాసానికి చేరుకొని కవితతో భేటీ అయ్యారు. విచారణ అంశాలపై వారితో మాట్లాడుతున్న సమయంలోనే.. బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సోమ భరత్, మరికొందరు కూడా కలిసి మాట్లాడారు. ఈడీ విచారణను ఎదుర్కొనే అంశమై వీరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు కవిత మీడియాతో మాట్లాడతారని సమాచారం ఇచ్చారు. ఇందుకోసం గేటు బయట ఏర్పాట్లు కూడా చేశారు. కానీ పదకొండు గంటలైనా కవిత బయటికి రాలేదు. అప్పటికే చాలామంది పార్టీ నేతలు, కార్యకర్తలు తుగ్లక్‌రోడ్‌ ప్రాంతానికి చేరుకోవడంతో పోలీసులు భద్రత పెంచారు. ఐదారు పోలీస్‌ బస్సులను రప్పించారు. కవిత భద్రత కోసం ఎస్కార్ట్‌ వాహనం కూడా సిద్ధం చేయడంతో.. ఆమె ఈడీ విచారణకు వెళతారని  అంతా భావించారు. 

ఈడీ కార్యాలయానికి కవిత న్యాయవాది 
పదకొండున్నర గంటలకు కూడా నివాసం నుంచి కవిత బయటికి రాలేదు. దీనితో ఆమె ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై చర్చలు మొదలయ్యాయి. కాసేపటికే సోమ భరత్‌తోపాటు మరికొందరు న్యాయవాదులు తుగ్లక్‌ రోడ్‌ నివాసం నుంచి బయటికి వచ్చి .. ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీకి కవిత రాసిన లేఖను, ఇతర డాక్యుమెంట్లను అధికారులకు అందించారు. విచారణకు ఆమె రాలేకపోతున్న అంశాన్ని వివరించారు.

అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చి న సోమ భరత్‌.. సుప్రీం పిటిషన్, మహిళను విచారించే అంశాలపై ఈడీకి వివరణ ఇచ్చామని, దీనిపై ఈడీ ఎలాంటి స్పందన తెలపలేదని మీడియాకు వెల్లడించారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. సోమ భరత్‌ మాట్లాడిన కొంతసేపటి తర్వాత.. కవిత భద్రత కోసం సీఎం నివాసానికి వచ్చి న పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం బయటికి వెళ్లిపోయింది.

ఢిల్లీ పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనితో కవిత ఈడీ విచారణకు హాజరుకావడం లేదని స్పష్టత వచ్చింది. అయితే 20న విచారణకు రావాలంటూ ఈడీ మరోమారు కవితకు నోటీసులు ఇచ్చి ంది. దీనిపై కవిత, ఇతర మంత్రులు న్యాయ నిపుణులతో చర్చించారు. మళ్లీ సుప్రీం తలుపు తట్టే అంశంపై వారితో చర్చించినట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు