రైతు దీక్షలు : ఖాళీ చేయిస్తే ఉరి వేసుకుంటాం

28 Jan, 2021 19:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న రైతులను వెంటనే ఖాళీ చేయించాలని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ చేసిన ఆదేశాలు ఉద్రిక్తతకు దారితీశాయి. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన యూపీ పోలీసులు గురువారం సాయంత్రం రైతులను ఖాళీ చేసేందుకు ఘూజీపూర్‌ వద్ద దీక్షలు చేస్తున్న రైతుల వద్దకు వెళ్లారు. వారు అక్కడి నుంచి ఖాళీ చేయకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతు సంఘాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రైతులపై దాడి చేయవద్దంటూ  భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. (రైతు దీక్షలు.. మరో ఎదురుదెబ్బ)

మూడు చట్టాలను రద్దు చేసే వరకు ఘాజీపూర్ ఖాళీ చేయమని చెప్పారు. శాంతియుతంగా దీక్షలను చేస్తున్న తమని ఖాళీచేయిస్తే ఇక్కడే ఉరివేసుకుంటామని రైతులు తేల్చిచెప్పారు. బీజేపీ ప్రభుత్వం తమను హతమార్చేందుకు కుట్రలు పన్నుతోందని రాకేష్‌ ఆరోపించారు. బుల్లెట్లు ఐనా ఎదుర్కొంటాం కానీ భయపడి పోయేదిలేదని తెగేసిచెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు 24 గంటల్లో ఘాజీపూర్‌ రహదారిని ఖాళీ చేయాల్సిందిగా యూపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం రైతుల్లో ఆందోళన నెలకొంది. ఘటనాస్థలికి పెద్ద ఎత్తున కేంద్ర, యూపీ బలగాలు చేరుకుంటున్నాయి. మరోవైపు రైతు దీక్షలను విరమించుకుంటున్నట్లు కిసాన్ మహా పంచాయత్, భారతీయ కిసాన్ యూనియన్ (లోక్‌శక్తి) సంఘాలు ప్రకటించాయి.

మరిన్ని వార్తలు