షాకింగ్‌ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్‌ తీగ

9 Dec, 2022 10:14 IST|Sakshi

కోల్‌కతా: రైల్వే లైన్‌ ఓల్టేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలుసు. ఆ తీగలను తాకిన క్షణాల్లోనే కాలి బూడిదవుతారు. అలాంటి ఓ హైఓల్టేజ్‌ విద్యుత్తు వైరు తెగి మీద పడితే.. ఎంత ప్రమాదమో ఊహించనక్కర్లేదు. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని ఖారగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. అదీ ప్లాట్‌ ఫారమ్‌పై ఉన్న వ్యక్తిపై తెగి పడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే? 

ఖారగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ ఫారమ్‌పై టికెట్‌ కలెక్టర్‌(టీసీ) నిలుచుని ఉండగా.. ఒక్కసారిగా హైఓల్టేజ్‌ విద్యుత్తు తీగ ఆయనపై పడింది. క్షణాల్లో తీగతో పాటే ట్రాక్‌పై పడిపోయాడు టీసీ. ఆయనతో మాట్లాడుతున్న మరో వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. బాధితుడు సుజన్‌ సింఘ్‌ సర్దార్‌గా గుర్తించారు. విద్యుత్తు షాక్‌తో తీవ్ర గాయాలైన టీసీని రైల్వే సిబ్బంది, అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. 

దీనిపై అనంత్‌ రూపనగూడి అనే రైల్వే సిబ్బంది ట్విటర్‌లో వీడియో షేర్‌ చేశారు. ‘విచిత్రమైన ప్రమాదం. ఒక పెద్ద లూస్‌ కేబుల్‌ పక్షుల వల్ల ఓహెచ్‌ఈ తీగపై పడింది. దీంతో హైఓల్టేజ్‌ తీగ టీటీఈ తలపై పడింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.’ అని రాసుకొచ్చారు. మరోవైపు.. తీగ తెగి పడడానికి గల కారణాలు తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య

మరిన్ని వార్తలు