EPFO: పెన్షనర్లు ఆగ్రహం.. నాలుగు నెలలని వారంలోనే ముగింపా?

7 Mar, 2023 13:07 IST|Sakshi

ఈపీఎఫ్‌ఓ అధిక పెన్షన్‌ దరఖాస్తు ప్రక్రియపై సీనియర్ల తీవ్ర ఆగ్రహం 

సెప్టెంబర్‌ 1, 2014కు ముందు రిటైరైన వారికి ఈ నెల 3న ముగిసిన దరఖాస్తు గడువు 

సర్క్యులర్‌ ఇచ్చింది గత నెల 20న.. దరఖాస్తు లింకును తెచ్చింది 25న.. 

సుప్రీంతీర్పు మేరకు ఇవ్వాల్సిన గడువు నాలుగు నెలలు 

వారంలోనే దరఖాస్తుల స్వీకరణ ఆపేయడంపై మండిపడుతున్న పెన్షనర్లు 

దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్నవారు 91,258 మంది మాత్రమే.. 

సిరిపురం మాధవరావు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసి.. 2013 మేలో పదవీ విరమణ పొందారు. ఆయన సర్వీసులో ఉన్నప్పుడే అధిక పెన్షన్‌ కోసం ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చారు. అయితే ఈపీఎఫ్‌ఓ అధికారులు దానిని తిరస్కరించడంతో సాధారణ పెన్షన్‌ పొందుతున్నారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తిరిగి అధిక పెన్షన్‌ కోసం ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ప్రయత్నిం​చారు. కానీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడం, కొన్నిసార్లు ఓపెన్‌ అయినా వివరాలు నమోదు చేసేటప్పుడు స్తంభించిపోవడం ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇంతలో గడువు ముగిసింది. దీంతో ఈపీఎఫ్‌ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: అధిక పెన్షన్ల విషయంలో ‘ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)’తీరుపై పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు, ఆప్షన్‌ నమోదులో గందరగోళం, త్వరగా గడువును ముగించడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 2014 సెప్టెంబర్‌ 1 కంటే ముందు పదవీ 
విరమణ పొందినవారు దరఖాస్తు చేసుకోలేక నష్టపోయామని వాపోతున్నారు. ఈపీఎఫ్‌ఓ తాత్సారం, సర్వర్‌ సమస్యతోపాటు నమోదు విషయంలో అవగాహన లోపంతో జాయింట్‌ ఆప్షన్‌ ఇవ్వలేకపోయామని అంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాము చేసేదేమీ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. 

ఇంతకీ  ఏం జరిగింది? 
ఈపీఎఫ్‌ఓ చందాదారులు, పెన్షనర్లకు సంబంధించి అధిక పెన్షన్‌ అమలుపై సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌ 4న తీర్పు ఇచ్చింది. ఆ రోజు నుంచి నాలుగు నెలల పాటు దరఖాస్తులకు గడువు ఇవ్వాలని ఆదేశించింది. 2023 మార్చి 3వ తేదీ వరకు గడువును నిర్దేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన ఈపీఎఫ్‌ఓ.. చాలా తాత్సారం చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 20న దీనిపై ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అంతేకాదు దరఖాస్తులు, జాయింట్‌ ఆప్షన్‌కు సంబంధించిన లింకును మరో ఐదురోజులు ఆలస్యంగా 25వ తేదీన అందుబాటులోకి తెచ్చింది. మార్చి 3వ తేదీతో గడువు ముగియనుండగా.. కేవలం వారం రోజుల ముందు మాత్రమే లింకును అందుబాటులోకి తేవడం గమనార్హం. అయితే 2014 సెప్టంబర్‌ 1 తర్వాత పదవీవిరమణ పొందినవారు, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ మరో రెండునెలల పాటు అవకాశం కల్పించింది. వారు మే 3 నాటికల్లా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ 2014 సెపె్టంబర్‌ 1వ తేదీకి ముందు రిటైరైన వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీనితో వారిలో చాలా మంది అధిక పెన్షన్‌కు దూరమయ్యారు. 

దేశవ్యాప్తంగా  91,258 దరఖాస్తులే.. 
 2014 సెపె్టంబర్‌ 1వ తేదీకి ముందు రిటైరైనవారిలో దేశవ్యాప్తంగా కేవలం 91,258 మంది మాత్రమే అధిక పెన్షన్‌ కోసం జాయింట్‌ ఆప్షన్‌ ఇవ్వగలిగారు. పేరుకు నాలుగు నెలలు అవకాశం ఇచ్చినా.. సర్క్యులర్‌ జారీ, ఆన్‌లైన్‌ లింకు అందుబాటులోకి తేవడంలో ఈపీఎఫ్‌ఓ జాప్యం చేసిందని సీనియర్‌ పెన్షనర్లు మండిపడుతున్నారు. తమకు మరో అవకాశం కల్పించాలంటూ ఈపీఎఫ్‌ఓకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

చదవండి: ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్‌.. అంత ఈజీ కాదు!?

మరిన్ని వార్తలు