Karnataka Hijab Controversy: ‘హిజాబ్‌’పై ధర్మాసనం.. కర్ణాటక హైకోర్టు సీజే నిర్ణయం

10 Feb, 2022 06:12 IST|Sakshi

కర్ణాటక సీజే సారథ్యంలో ఏర్పాటు

విశ్వాసాల మేరకు వస్త్రధారణను అనుమతించండి

సింగిల్‌ జడ్జి ముందు పిటిషన్లర వాదన

బెంగళూరు: హిజాబ్‌–కాషాయ కండువా గొడవతో కొద్ది రోజులుగా అట్టుడికిన కర్ణాటకలో విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో బుధవారం ప్రశాంతత నెలకొంది. దీనిపై విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన ఈ ఫుల్‌ బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ ఎస్‌.దీక్షిత్, జస్టిస్‌ జేఎం ఖాజీ కూడా ఉంటారు.

వివాదంపై మంగళ, బుధవారాల్లో విచారణ జరిపిన జస్టిస్‌ దీక్షిత్‌ నివేదన మేరకు సీజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ దీక్షిత్‌ ముందు ఇరు పక్షాలు వాడివేడిగా వాదనలు విన్పించాయి. పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. విద్యార్థినులు తమ మత విశ్వాసాలను అనుసరించేందుకు అనుమతించాలని వారి తరఫు లాయర్‌ దేవదత్త కామత్‌ కోరారు. ఇందుకు రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ప్రభులింగ్‌ నవద్గీ అభ్యంతరం తెలిపారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులివ్వడం పిటిషన్‌ను అనుమతించడమే అవుతుందని వాదించారు.

విద్యార్థులు విధిగా డ్రెస్‌ కోడ్‌ను పాటిస్తూ తరగతులకు హాజరు కావాలన్నారు. కాలేజీ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (సీడీఎంసీ) తరఫున హాజరైన లాయర్‌ సజన్‌ పూవయ్య కూడా మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకించారు. ప్రస్తుత యూనిఫారాలు ఏడాదిగా అమల్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘తల్లిదండ్రులు, టీచర్లు తదితరులందరితో కూడిన సీడీఎంసీ ఏటా సమావేశమై యూనిఫాం తదితరాలపై ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకుంటుంది. యూనిఫాంపై ఇప్పటిదాకా లేని అభ్యంతరాలు ఇప్పడెందుకు?’’ అని ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ దీక్షిత్‌ అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు