కర్ణాటకలో ‘హిజాబ్‌’పై అదే రగడ

8 Feb, 2022 06:00 IST|Sakshi

రాష్ట్రంలో శాంతిని కాపాడాలని సీఎం బసవరాజ బొమ్మై విజ్ఞప్తి

బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్‌(బురఖా) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్‌) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు సోమవారం హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపాల్‌ మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు. హిజాబ్‌ తొలగించేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్‌ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్‌ రగడపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించారు.

రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూనిఫామ్‌ నిబంధనలు పాటించాలని విద్యాసంస్థలను కోరారు. హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్‌ మాట్లాడుతూ.. హిజాబ్‌ ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. రోడ్లపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. రోడ్లపై బైఠాయించడం భారతీయ సంస్కృతి కాదన్నారు. హిజాబ్‌ ధరించినవారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

అలాంటి వారిని సాధారణ తరగతుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చిక్కబళ్లాపూర్, బాగల్‌కోట్, బెళగావి, హసన్, మండ్య తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి, కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ బెళగావి, మండ్యాలో విద్యార్థినులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చిక్కమగళూరులో కొందరు విద్యార్థులు నీలి రంగు కండువాలు ధరించి, కాలేజీకి చేరుకున్నారు. జైభీమ్‌ అంటూ నినదించారు. హిజాబ్‌ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. 

మరిన్ని వార్తలు