Hijab Row: హిజాబ్‌ వివాదం.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

16 Mar, 2022 02:02 IST|Sakshi

హిజాబ్‌ తప్పనిసరి కాదు

కర్ణాటక హైకోర్టు తీర్పు 

యూనిఫాం ధరించాలనడం తప్పు కాదన్న ధర్మాసనం 

సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్లు 

కర్ణాటకలో విద్యార్థినుల నిరసనలు 

రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ 

సాక్షి, బెంగళూరు: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇస్లాం ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరేమీ కాదని ప్రకటించింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ, జస్టిస్‌ కృష్ణ ఎస్‌.దీక్షిత్, జస్టిస్‌ జైబున్నీసా ఎం.వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 129 పేజీలు తీర్పు వెలువరించింది. తీర్పును సవాలు చేస్తూ కొందరు మంగళవారమే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.

తీర్పు మత విశ్వాసాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. తామూ సుప్రీంకు వెళ్తామని వక్ఫ్‌ బోర్డు అధ్యక్షుడు మౌలానా షఫీ తెలిపారు. హిజాబ్‌ ధారణ గురించి ఖురాన్‌లో స్పష్టంగా ఉందని, ఏ ఆధారాలతో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. తీర్పును ముస్లిం విద్యార్థినులు వ్యతిరేకించారు. కర్ణాటకలో పలుచోట్ల వారు పరీక్షలు బహిష్కరించారు. చదువుతో పాటు హిజాబ్‌ కూడా ముఖ్యమేనని, దాన్ని ధరించి తీరతామని అన్నారు. 

11 రోజుల విచారణ 
కర్ణాటకలో జనవరిలో మొదలైన హిజాబ్‌ వివాదం రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే. హిజాబ్‌కు పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించడంతో వివాదం మరింత రాజుకుంది. దాంతో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు సంఘాలతో పాటు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. సింగిల్‌ బెంచ్‌ కేసును స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం 11 రోజులు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. 

సీజే ఇంటికి భద్రత  
తీర్పు నేపథ్యంలో బెంగళూరులో సీజే, మిగతా ఇద్దరు న్యాయమూర్తుల నివాసాలకు పోలీసు భద్రత పెంచారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధించారు.

వివాదంపై హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. విద్యార్థులకు చదువు కంటే ఏదీ ముఖ్యం కాదు. కోర్టు ఆదేశాలను అంతా పాటించాలి. శాంతిభద్రతలను కాపాడాలి. 
–సీఎం బసవరాజు బొమ్మై 

పిల్లలకు చదువు ముఖ్యం. హైకోర్టు ఆదేశాలను పాటించాలి. 
–జేడీఎస్‌ఎల్పీ నేత కుమారస్వామి 

హైకోర్టు తీర్పును శిరసావహించాలి. తీర్పును చదివాక పూర్తిగా స్పందిస్తా. 
–సీఎల్పీ నేత సిద్ధరామయ్య

హిజాబ్‌ ధారణ గురించి ఖురాన్‌లో స్పష్టంగా ఉంది.    – వక్ఫ్‌ బోర్డు 

కీలకమైన నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
కేసుకు సంబంధించి నాలుగు ప్రముఖ వివాదాంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 

1.ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం హిజాబ్‌ లేదా స్కార్ఫ్‌ ధరించడం తప్పనిసరి ఆచరణా. హిజాబ్‌ ధరించడం ఆర్టికల్‌ 25 కింద సమర్థనీయమేనా? 
ధర్మాసనం: ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్‌ ధరించడం తప్పనిసరేమీ కాదు. 

2.విద్యా సంస్థల్లో యూనిఫాంను తప్పనిసరి చేయడం ఆర్టికల్‌ 19 (1) కింద వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఆర్టికల్‌ 21 కింద వ్యక్తి హక్కును కాలరాయడం అవుతుందా? 
ధర్మాసనం: విద్యా సంస్థల్లో యూనిఫాంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొన్ని అంశాల్లో నిషేధాజ్ఞలను విధించడం ప్రభుత్వానికున్న రాజ్యాంగ హక్కు. దీన్ని విద్యార్థులు ప్రశ్నించడానికి వీల్లేదు. 

3.యూనిఫాం జీవో నిబంధనలకు వ్యతిరేకమా? ఆర్టికల్‌ 14, 115లను ఉల్లంఘించడమా? 
ధర్మాసనం: జీవోలో ఎలాంటి ఉల్లంఘన, చట్ట వ్యతిరేక చర్య లేవు. 

4.విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా, అందుకు కాలేజీలు అభ్యంతరపెట్టకుండా ఆదేశాలివ్వాలా? 
ధర్మాసనం: అవసరం లేదు.

మరిన్ని వార్తలు