Karnataka Hijab Row: హిజాబ్‌ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే..

9 Feb, 2022 16:53 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్‌ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. రాష్ట్రంలోని ఉడిపిలో మొదలైన ఈ వివాదం మెల్లమెల్లగా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇక హిజాబ్‌ వివాదం కర్నాటకలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో మూడురోజుల పాటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు రెండో రోజు (బుధవారం) విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా హిజాబ్‌ అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించి.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ పేర్కొన్నారు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్‌ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. 
చదవండి: మేఘాలయలో కాంగ్రెస్‌ కల్లాస్‌.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు..

సింగిల్‌ బెంచ్‌ తీర్పుతో తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్  ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు బెంగళూరులో పాఠశాలలు, కళాశాలల వద్ద నిరసనలు, ప్రదర్శనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ కర్ణాటక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, ప్రీ యూనివర్సిటీ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు లేదా ఇటువంటి విద్యా సంస్థల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, ఈ నిషేధం రెండువారాలపాటు అమలవుతుందని తెలిపారు. 
చదవండి: హిజాబ్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ కీలక వ్యాఖ్యలు

గత నెల ఉడుపిలోని ఓ ప్రభుత్వ కాలేజీ హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను యాజమాన్యం అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలయ్యింది. దీనికి పోటీగా పలువురు కాషాయ కండువాలను మెడలో వేసుకుని పాఠశాలలకు రావడంతో రెండు వర్గాలుగా విద్యార్థులు విడిపోయారు. శివమొగ్గలో పరిస్థితి అదుపుతప్పడంతో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు