ఉమ్మడి కృషితో దేశం ఉన్నత శిఖరాలకు

18 Nov, 2021 05:54 IST|Sakshi

ఎవరి విధులను వారు నిర్వర్తించడమే తారక మంత్రం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు

అఖిల భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సదస్సు ప్రారంభం

న్యూఢిల్లీ/సిమ్లా: పార్లమెంట్‌ సభ్యుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, దేశ అభివృద్ధి పరుగులు పెట్టడానికి ఇదే తారక మంత్రమని ప్రధాని మోదీ ఉద్బోధించారు. పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్ల (అఖిల భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు) సదస్సు బుధవారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు జరగనుంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు ప్రజలందరి ఉమ్మడి కృషితోనే దేశాన్ని అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలకు చేర్చవచ్చని అన్నారు.

కోవిడ్‌–19 మహమ్మారిపై మనం సాగించిన పోరాటం సబ్‌ కా ప్రయాస్‌కు (అందరి కృషి) ఒక చరిత్రాత్మక ఉదాహరణ అని గుర్తుచేశారు. పలు భిన్నమైన అంశాలపై రగడ కారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు తరచుగా అంతరాయం కలుగుతుండడం పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యుల ప్రవర్తన భారతీయ విలువల దారిలోనే ఉండాలని సూచించారు. చట్టసభల్లో ఆమోదించే చట్టాలు, తీసుకొనే విధాన నిర్ణయాలు ‘ఏక్‌ భారత్, శ్రేష్ట భారత్‌’ అనే సెంటిమెంట్‌ను బలోపేతం చేసేవిగా ఉండాలన్నారు. చట్టసభల్లో పాటించే సంప్రదాయాలు, పద్ధతులు భారతీయ ఆత్మను ప్రతిబింబించాలని ఉద్ఘాటించారు. పార్లమెంట్, అసెంబ్లీ, మండలిలో చర్చలు అర్థవంతంగా, హూందాగా, గౌరవప్రదంగా జరగాలని ఆకాంక్షించారు. సభ్యుల మధ్య రాజకీయ ఆరోపణలు, విమర్శలకు తావులేకుండా నాణ్యమైన, ఆరోగ్యకరమైన సంవాదాలు, చర్చల కోసం చట్టసభల్లో ప్రత్యేక సమయం కేటాయిస్తే బాగుంటుందని సూచించారు.

ఒకే దేశం.. ఒకే చట్టసభ వేదిక
ప్రజాస్వామ్యం అనేది భారత్‌కు కేవలం ఒక వ్యవస్థ కాదని, అది దేశ సహజ స్వభావమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాబోయే 25 సంవత్సరాలు మనకు అత్యంత కీలకమని చెప్పారు. వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల దిశగా భారత్‌ ముందుకు పయనిస్తోందని తెలిపారు. ఇలాంటి తరుణంలో చట్టసభల సభ్యులు వారి విధులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వారి ప్రవర్తన, చేసే పనులు దేశ ప్రజలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. డ్యూటీ, డ్యూటీ, డ్యూటీ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతపై అసమ్మతి స్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చట్టసభల సభ్యులకు సూచించారు. మన దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవాలన్నారు. ‘ఒకే దేశం.. ఒకే చట్టసభ వేదిక’ అనే ఆలోచనను మోదీ తెరపైకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్‌తో మన పార్లమెంటరీ వ్యవస్థకు సాంకేతిక తోడ్పాటు లభించడమే గాక దేశంలోని అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను అనుసంధానించవచ్చని వివరించారు.

చట్టసభల గౌరవాన్ని పెంచే చర్యలు: బిర్లా
దేశంలో చట్టసభలు పని చేసే సమయం నానాటికీ తగ్గిపోతుండడం పట్ల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల రూపకల్పన, ఆమోదంపై సరైన చర్చ జరగకపోవడం మంచి పరిణామం కాదన్నారు. స్పీకర్ల సదస్సులో మాట్లాడారు. చట్టసభల గౌరవాన్ని, ప్రతిష్టను పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, నిర్ణయాత్మక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు