ప్రకృతి కన్నెర్ర: చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది!

13 Aug, 2021 13:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రకృతి ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం పరిస్థితులు అంతే దారుణంగా ఉంటాయి. ఇందుకు సాక్ష్యాలుగా ప్రతి ఏటా వరదలు, వర్షాలు, వాతావరణ మార్పులంటూ ఆ కోపాగ్నిని మనం చూస్తునే ఉన్నారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాలో ఎన్‌హెచ్‌-5పై కొండచరియలు విరిగి వాహనాలపై పడి ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ‍ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడకముందే తాజాగా లాహువల్-స్పితి జిల్లాలో శుక్రవారం కొండచరియలు విరిగి చంద్రభాగ నదిలో పడ్డాయి. 

దీంతో ఆ నది ప్రవాహాన్ని మొత్తాన్ని ఇవి అడ్డుకోవడంతో ఆ సరస్సు పరిసరాల్లో ఈ నీటి మీద ఆధారపడిన వ్యవసాయ క్షేత్రాలకు, చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2,000 మంది ప్రజలకు నీటి సమస్య రానుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం గానీ ఎవరికీ గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. నిన్న ఉదయం కొండలోని కొంత భాగం కింద పడి పూర్తిగా నదిని అడ్డుకుందని చెప్పారు. కాగా ప్రస్తుతం అక్కడి పరిస్థితిని పరిశీలించడానికి నిపుణుల బృందం వెళ్లిందని తెలిపారు. ఈ వీడియోను పరిమల్‌ కుమార్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఆ వీడియోలో.. చూస్తుండగానే కొండచరియలు చంద్రభాగ నదిపై పడటంతో పాటు ఆ సరసు మొత్తాన్ని మంచుతో కప్పినట్లు మట్టి కప్పేసిన వీడియోను మనం చూడవచ్చు.

బుధవారం మధ్యాహ్నం కిన్నౌర్‌ జిల్లాలోని నిగుల్‌సేరి ప్రాంతంలో ఎన్‌హెచ్‌-5పై కొండచరియలు విరిగి వాహనాలపై పడిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటనలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మొత్తం ఈ ఘటనలో 40 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹ 50,000 పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రకటించారు. గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స కూడా అందుతుందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు