హిమాచల్‌లో భారీగా కురుస్తున్న మంచు

4 Jan, 2021 05:23 IST|Sakshi
అటల్‌ టన్నెల్‌ వద్ద మంచులో నిలిచిన వాహనాలు

లాహౌల్‌లో చిక్కుకున్న 300 మంది పర్యాటకులను కాపాడిన పోలీసులు

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం రొహ్‌తంగ్‌లో దట్టమైన మంచు కారణంగా అటల్‌ టన్నెల్‌ సమీపంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను పోలీసులు కాపాడారు. శనివారం ఉదయం కొందరు పర్యాటకులు అటల్‌ టన్నెల్‌ దాటి లాహౌల్‌ వైపు వెళ్లారు. సాయంత్రం తీవ్రంగా మంచు కురియడంతో తిరిగి మనాలీ రావడం వీలుపడక అక్కడే ఉండిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని వాహనాల్లో తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పర్యాటకులతో వస్తున్న వాహనాలు మంచు కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి.

బీఎస్‌ఎఫ్‌ సాయంతో రెండు బస్సులు సహా మొత్తం 70 వాహనాల ద్వారా పర్యాటకులను శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12.33 గంటల వరకు మనాలీకి తరలించడం పూర్తయిందని కుల్లు ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ తెలిపారు. కాగా, టన్నెల్‌లో పోలీసులు ఓ పర్యాటకుడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులను శిక్షిస్తామని ఎస్పీ చెప్పారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రపంచంలోనే పొడవైన అటల్‌ టన్నెల్‌ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. 10,040 అడుగుల ఎత్తులో 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం లాహౌల్‌–మనాలీలను కలుపుతుంది.

మరిన్ని వార్తలు