Assembly Elections 2022: హిమాచల్‌లో ముగిసిన పోలింగ్‌

12 Nov, 2022 19:23 IST|Sakshi

Upadates

హిమాచల్‌లో ముగిసిన పోలింగ్‌
- హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదు. ధర్మశాల, సిమ్లాలో ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం, వీవీప్యాట్స్‌కు సీల్‌ వేసి స్ట్రాంగ్‌ రూమ్స్‌కు తరలించారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 8వ తేదీన వెలువడుతాయి.

02:00PM

1 గంట వరకు 37.19 శాతం ఓటింగ్‌
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు 37.19 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటర్లకు ప్రియాంక సూచన.. 
హిమాచల్‌ ప్రదేశ్‌ అభివృద్ధి, భవిష్యత్తు కోసం విచక్షణతో ఓటు వేయాలని సూచించారు కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ. మీ గురించి, మీ రాష్ట్ర పరిస్థితి గురించి మీకే పూర్తిగా తెలుసునని, పరిస్థితులను గమనించి బంగారు భవిష్యత్తు కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 

11:45AM

11 గంటల వరకు 17.98 శాతం ఓటింగ్‌.. 
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 17.98 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

40-45 సీట్లు గెలుస్తాం: కాంగ్రెస్‌
సిమ్లాలోని రాంపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్‌ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌. అభివృద్ధికి ఓటు వేయాలని సూచించారు. 68 స్థానాల్లో 40-45 సీట్లు గెలుస్తాని దీమా వ్యక్తం చేశారు.
సిమ్లాలోని సైనిక్‌ రెస్ట్‌ హౌస్‌ లాంగ్‌వుడ్‌ పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ ఆనంద్‌ శర్మ

ఓటేసిన కేంద్ర మంత్రి..
హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌ కుమార్‌ థుమాల్‌, ఆయన కుమారు, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌లు తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.హమిర్‌పుర్‌లోని సమిర్‌పుర్‌ పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో సీఎం జైరాం ఠాకూర్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకే మళ్లీ అధికారం ఇస్తారని దీమా వ్యక్తం చేశారు అనురాగ్‌ ఠాకూర్‌. 

10:30AM

5.02 శాతం ఓటింగ్‌
ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.02శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా సిర్మౌర్‌లో 6.26 శాతం, లాహౌల్‌లో అత్యల్పంగా 1.56శాతం ఓటింగ్‌ నమోదైనట్లు పేర్కొంది.

9:30AM

ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలి: పీఎం మోదీ
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కొత్తగా ఓటు హక్కు సాధించిన యువ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జైరాం ఠాకూర్‌ కుటుంబం
హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ఆయన కుటుంబంతో కలిసి వచ్చి సెరాజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండీలోని పోలింగ్‌ స్టేషన్‌ 44లో ఓటు వేశారు. ఈ సందర్భంగా తాము ఎంతో ఉత్సాంగా ఉన్నామని, మండీ ఎప్పుడూ సీఎం జైరాం ఠాకూర్‌కు మద్దతుగా ఉంటుందన్నారు ఆయన కూతురు చంద్రికా ఠాకూర్‌. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గమనించిన ప్రజలను మళ్లీ ఆ పార్టీకే ఓటు వేస్తారని దీమా వ్యక్తం చేశారు.

8:00AM
హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం

డబుల్‌ ఇంజన్‌ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి శనివారం జరిగే ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. సీఎం జైరామ్‌ ఠాకూర్, దివంగత సీఎం వీరభద్ర సింగ్‌ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల్లో 82 శాతం, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 90 శాతం కోటీశ్వరులే!

మంచులో నడుస్తూ...
మొత్తం 7,884 పోలింగ్‌ కేంద్రాల్లో 397 కేంద్రాలు మంచుతో నిండి అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో కాజాలోని తషిగాంగ్‌ పోలింగ్‌ బూత్‌ దేశంలోనే అత్యంత ఎత్తులో ఉండే పోలింగ్‌ కేంద్రం.

నువ్వా, నేనా?
బీజేపీ తరఫున ప్రచారాన్ని ప్రధాని మోదీ తానే ముందుండి నడిపించారు. ఆఖరి నిముషంలో ఓటర్లకు బహిరంగంగా లేఖ రాసి కమలం గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ తరఫున ప్రచార భారమంతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాపైనే పడింది.

గత రెండేళ్లలో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌ హిమాచల్‌లోనైనా గెలిచి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరసగా రెండోసారి గెలిచిన పార్టీగా చరిత్ర సృష్టిస్తుంది. ఈ విజయం వచ్చే ఏడాది హిందీ బెల్ట్‌లో జరిగే అత్యంత కీలకమైన తొమ్మిది రాష్ట్రాల గెలుపు అవకాశాలను పెంచుతుందన్న భావనలో పార్టీ ఉంది.

మరిన్ని వార్తలు