కొండంత సమస్యలు.. గోరంత హామీలు

10 Nov, 2022 06:39 IST|Sakshi

హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటరు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆందోళన నెలకొంది. అయిదు అంశాలు ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి.                    

సమస్యలివీ...
నిరుద్యోగం  
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 7.6% ఉంటే హిమాచల్‌ ప్రదేశ్‌లో 8.6 నుంచి 9.2 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత 15 లక్షల మంది వరకు ఉంటే, వారిలో 8.77 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌చేంజ్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు.  

యాపిల్‌ రైతుల దుస్థితి
దేశంలో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక యాపిల్‌ ఉత్పత్తిలో 26% వాటా హిమాచల్‌దే. గిట్టుబాటు ధర లేక రైతులు నిరసన బాట పట్టారు. సాగు ఖర్చు పెరగడం, వాతావరణ మార్పులు కుంగదీస్తున్నాయి. దీనికి తోడు యాపిల్స్‌ను రవాణ కోసం వాడే కార్టన్లపై జీఎస్‌టీని 12 నుంచి 18 శాతానికి పెంచడం రైతుపై మరింత భారాన్ని పెంచింది  

రోడ్డు కనెక్టివిటీ  
కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో ఏకంగా 39% గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు! ఇవన్నీ అటవీ ప్రాంతంలోని గ్రామాలు కావడంతో రోడ్లు నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి.  ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేక వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,125 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బీజేపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది.

అగ్నిపథ్‌  
త్రివిధ బలగాల్లో కాంట్రాక్ట్‌ నియామకానికి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్‌ పథకం మంచుకొండల్లో మంటలు రాజేసింది. 70 లక్షల హిమాచల్‌ జనాభాలో ఏకంగా 10 శాతం పని చేస్తున్న, లేదా రిటైర్డ్‌ సైనికులే ఉన్నారు. ఎందరో యువకులు సైన్యంలో చేరాలని ఆశతో శిక్షణ పొందుతున్న సమయంలో  బీజేపీ తెచ్చిన పథకం వారిని నిరాశలో ముంచింది.  

ఓపీఎస్‌  
ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ కూడా ఎన్నికల్లో అత్యంత ప్రభావిత అంశంగా మారింది. 2004లో నాటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. పాత పెన్షన్‌ పథకం ప్రకారం ఉద్యోగులు ఆఖరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు. కొత్త స్కీమ్‌లో ఉద్యోగుల జీతం నుంచి 10%, ప్రభుత్వ వాటాగా 14% ఇస్తారు. కాంగ్రెస్, ఆప్‌ పాత పథకం తెస్తామంటున్నాయి.


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు