HP: ఔషధ మొక్కల పెంపకానికి ఆయుష్ 128.94 లక్షలు

29 Jun, 2021 14:22 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరోగ్య సంరక్షణ  వ్యవస్థ ఆయుర్వేదం. భారతదేశంలో 5000 సంవత్సరాల పూర్వం నుంచే ఆయుర్వేదంతో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఎంతో మంది ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఆయుర్వేంద చిట్కాలను అనుసరిస్తుంటారు. ఇక కొన్నాళ్ల క్రితం కాలుష్యం తక్కువగా ఉండేది. అందువల్ల అంతగా ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. అంతేకాకుండా ఔషధ మొక్కల వినియోగం వాటి విలువ గురించి చాలామందికి పూర్తిగా తెలియదు. ఈ మొక్కల ఉపయోగం గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో  ఆయుష్ డిపార్ట్‌మెంట్ జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద ఔషధ మొక్కల సాగు కోసం హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందిస్తోంది.  

సిమ్లా: సహజ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది.  దీంతో చిన్న మొత్తంలో భూములు కలిగిన రైతుల ఆదాయం పెంచడానికి ఔషధ మొక్కలను పెంచాల్సిందిగా హిమాచల్‌ ప్రదేశ్‌ రైతులను పోత్సహిస్తున్నట్లు అక్కడి అధికారులు సోమవారం తెలిపారు. ఇందుకోసం కొంతమంది రైతులను ఓ బృందంగా ఏర్పాటు చేశారు. అయితే ఔషధ మొక్కలను పెంచడానికి ఆర్థిక సాయం కావాలంటే రెండు హెక్టార్ల భూమి ఉండాలి.  ఔషధ మొక్కల కోసం 2018 జనవరి నుంచి 318 మంది రైతులకు 99.68 లక్షలు ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా 2019-20లో జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో ఔషధ మొక్కలను పెంచడానికి 128.94 లక్షలు అందించారు. ఇందులో 54.44 లక్షలు ‘అటిస్’, ‘కుట్కి’, ‘కుత్’, ‘షాతావారి’, స్టెవియా, ‘సర్పగంధ’ సాగుకు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు జోగిందర్ నగర్‌లోని ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్‌లోని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో లోకల్‌-కమ్-ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఆరు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఔషధ మొక్కల పెంపకం, పరిరక్షణను ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా ప్రజలలో అవగాహన కల్పించడానికి, ఆయుష్ విభాగం ప్లాంటేషన్ డ్రైవ్ ‘చారక్ వాటిక’ నిర్వహించింది. ఈ డ్రైవ్ కింద 1,167 ఆయుర్వేద సంస్థలలో 11,526 మొక్కలను నాటడంతో చారక్ వాటికలను స్థాపించారు.

చదవండి: ఆ ఇరువురు డైరెక్టర్లను నియమించండి! 

మరిన్ని వార్తలు