Kinnaur Landslide: 13 శవాలు వెలికితీత.. ఇంకా శిథిలాల కింద?

12 Aug, 2021 11:59 IST|Sakshi

సిమ్లా/హిమాచల్‌ ప్రదేశ్‌: కిన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టిపెళ్లలు తొలగించిన రక్షణా బృందాలు.. ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీశాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో 13 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. క్షతగాత్రులను సమీప భవానగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా హిమాచల్‌ప్రదేశ్‌ రెఖాంగ్‌ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగి పడిన విషయం విదితమే. ఆ సమయంలో రహదారిపై సుమారుగా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి.

 

ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. మిగతా వారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఇండో- టిబెటన్‌ బార్డర్‌ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ గురువారం వెల్లడించారు. ఘటనాస్థలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు.

కాగా మృతుల్లో ఎక్కువ మంది కిన్నౌర్‌ జిల్లాకు చెందిన వారే ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ వారి ఆచూకీ కోసం అధికారుల వద్దకు వెళ్లిన బంధువులు హృదయ విదాకరంగా విలపిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు చూసి కంటతడి పెడుతున్నారు.

మరిన్ని వార్తలు