ఐఐటీల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించండి

10 Oct, 2022 05:23 IST|Sakshi

అధికార భాషా పార్లమెంట్‌ కమిటీ సిఫార్సు

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలుసహా టెక్నికల్, నాన్‌–టెక్నికల్‌ విద్యా సంస్థల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించాలని అధికార భాషా పార్లమెంట్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఇంగ్లిష్‌ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు పంపింది. ఇంగ్లిష్‌ను ఐచ్ఛికంగా వాడాలని హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన 11వ నివేదికను ఇటీవలే రాష్ట్రపతికి సమర్పించింది.

నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే వాడాలన్న సూచన మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు కమిటీ ఉపాధ్యక్షుడు, బీజేడీ నేత భర్తృహరి మహతాబ్‌ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలి. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి ‘100 శాతం’ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాల యాలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలి.

వేరే రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అక్కడి స్థానిక భాషల్లో బోధించాలి. వలస వాసనను వదిలించుకుంటూ విదేశీ భాష ఇంగ్లిష్‌ను కాస్త పక్కనబెట్టాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. ‘ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్‌ ముస్లిం వర్సిటీలలో పూర్తిగా హిందీలోనే బోధిస్తే మేలు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీస్‌లు, మంత్రిత్వ శాఖల మధ్య లేఖలు, ఫ్యాక్స్‌లు ఈ–మెయిల్‌లలో హిందీ లేదా స్థానిక భాషలను వాడాలి. అధికారిక కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో, ఆహ్వాన పత్రాల్లో సులభంగా ఉండే హిందీ/స్థానిక భాషలనే వాడాలి’ అని సూచించింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్, రాజస్థాన్, ఢిల్లీ ఏ–కేటగిరీలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్‌ బి–కేటగిరీలో ఉన్నాయి. మిగతావి సి –కేటగిరీలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు