'చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి..'

28 Aug, 2023 08:26 IST|Sakshi

ఢిల్లీ:ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాని మహారాజ్‌ మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని కోరారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకముందే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్‌) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

చంద్రయాన్ 3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటును శివ శక్తిగా నామకరణం చేయడంపై ప్రధాని మోదీకి చక్రపాని మహారాజ్‌ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్‌ను రాజధానిగా మార్చాలని కోరారు. 

'చంద్రున్ని హిందూ సనాతన దేశంగా పార్లమెంట్‌లో ప్రకటించాలి. చంద్రయాన్ 3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా  నిర్మించాలి. అప్పుడు జిహాదీ స్వభావం ఉన్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారు.' అని స్వామి చక్రపాని మహారాజ్‌ అన్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాంశాల్లో స్వామి చక్రపాని మహారాజ్‌ చిక్కుకున్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు.  

కాగా.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరడంతో చంద్రయాన్ 3 విజయం సాధించింది. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటుని ప్రధాని మోదీ శివ శక్తి పాయింట్‌గా పేరు పెట్టారు. 

ఇదీ చదవండి: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు

మరిన్ని వార్తలు