ఐదు చెప్పు దెబ్బలు.. అత్యాచార నేరం మాఫీ!!

1 Jul, 2021 12:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మైనర్‌ అత్యాచార ఘటనలో పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిందితుడు బాధితురాలి చేతిలో ఐదు చెప్పు దెబ్బలు తినాలని తిక్క తీర్పు ఇచ్చారు ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామ పెద్దలు. వివరాల్లోకి వెళ్తే...

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ మహారాజ్‌గంజ్‌ జిల్లాలోని కోతిభార్‌ పోలీస్‌ స్టేషన్‌లోని ఓ కుగ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ మైనర్‌ కూతురిపై అదే గ్రామంలోని ఓ యువకుడు అత్యాచారం చేశాడంటూ పంచాయితీని ఆశ్రయించారు తల్లిదండ్రులు. అయితే పెద్దలు మాత్రం దాష్టీకమైన తీర్పు ఇచ్చారు. బాధితురాలి చెప్పుతో నిందితుడిని ఐదుసార్లు కొట్టాలని, యాభై వేల పరిహారం తీసుకుని ఘటన మరిచిపోమ్మని బాలిక తల్లిదండ్రులకు సర్దిచెప్పబోయారు. 

అయితే ఆ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. న్యాయం కోసం పట్టుబట్టారు. దీంతో పెద్దలు వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక కోతిభార్‌ స్టేషన్‌లో ఘటనపై.. పంచాయితీ పెద్దల తీరుపై ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి.  మరోవైపు సోషల్‌ మీడియాలో పంచాయితీ తీర్పు వైరల్‌ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాలిక వైద్య పరీక్షల నివేదిక అనంతరం.. కేసు దిశగా అడుగు వేస్తామని జిల్లా ఎస్పీ ప్రదీప్‌ గుప్తా వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

చదవండి: దీదీకి ఝలక్‌.. ఐదు వేల ఫైన్‌!

మరిన్ని వార్తలు