హిజ్బుల్‌ ముజాహిద్దీన్ చీఫ్‌ హతం..

1 Nov, 2020 17:55 IST|Sakshi

కశ్మీర్‌ : జమ్ముకశ్మీర్‌లో ఆదివారం  భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సైఫుల్లా హతమయ్యాడు. శ్రీనగర్‌ సరిహద్దులో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాగా మరో ఉగ్రవాది తమ అదుపులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. కాగా శ్రీనగర్‌లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు శనివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు దాగినట్లు అనుమానించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరుపగా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌ కమాండర్‌ సైఫుల్లా అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.


హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్ సైఫుల్లా( ఫైల్‌ ఫోటో)

కాగా పోలీసులు ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఉగ్రవాదుల నుంచి ఏకే-47, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ మ​ట్లాడుతూ.. పుల్వామా జిల్లాలోని మలంగ్‌పోరాకు చెందిన అతడు 2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరినట్లు తెలిపారు. రియాజ్ నాయకూ అతడ్ని నియమించి ఘాజీ హైదర్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. భద్రతా దళాలు సైఫుల్లాను మట్టుబెట్టడం తమకు గ్రేట్‌ ఎచీవ్‌మెంట్‌ అని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు