Sedition Law: దేశద్రోహ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తారా? 

11 May, 2022 09:01 IST|Sakshi

కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న

నేడు నిర్ణయం చెప్పాలంటూ ఆదేశం 

న్యూఢిల్లీ:  ‘‘బ్రిటిష్‌ వలస కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ (సెక్షన్‌ 124ఏ) చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్‌ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?’’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది. వీటిపై కేంద్రం వైఖరేమిటో బుధవారంలోగా తమకు చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. దాన్నిబట్టి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

ఈ చట్టం తరచూ దుర్వినియోగానికి గురవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఇందుకు తక్షణం అడ్డుకట్ట పడాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అందుకోసం అవసరమైతే పునఃసమీక్ష పూర్తయేదాకా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేయాలని సూచించింది. చట్టాన్ని సమీక్షించేలోగా పెండింగ్‌లో ఉన్న, ఇకపై నమోదయ్యే కేసుల విచారణను నిలిపివేయాలంటూ వస్తున్న సూచనలపై స్పందించాలని కేంద్రానికి సూచించింది. కేంద్రంతో చర్చించి బుధవారం కోర్టుకు తెలియజేస్తానని తుషార్‌ మెహతా చెప్పారు. 

‘‘దేశద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని కేంద్రమే ఆందోళన చెందుతుంటే ఇక పౌరుల హక్కులను ఎలా కాపాడతారు? ఈ చట్టం కింద ఇప్పటికే పలువురు జైళ్లలో ఉన్నారు. ఇంకా ఎందరి మీదనో ఈ చట్టం కింద అభియోగాలు మోపనున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పునఃసమీక్షకు ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించింది.

ఇంతకాలమని ఇదమిత్థంగా చెప్పలేమని తుషార్‌ మెహతా బదులిచ్చారు. అలాంటప్పుడు సమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహ చట్టం అమలును పక్కన పెట్టాల్సిందిగా రాష్ట్రాలకు సూచించలేరా అని ధర్మాసనం ప్రశ్నించింది. బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న దేశద్రోహం చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లెక్కకు మించి పిటిషన్లు దాఖలయ్యాయి. దీన్ని పునఃసమీక్షిస్తామని, అంతవరకు పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని కేంద్రం సోమవారం సుప్రీంను కోరింది. దేశద్రోహ చట్టం కింద 2015–20 మధ్య దేశవ్యాప్తంగా 356 కేసులు నమోదయ్యాయి.

మైనార్టీలను గుర్తించే అధికారం ఎవరిది?
మైనార్టీలను గుర్తించడంలో పలు రాష్ట్రాల్లో కేంద్రం అనుసరిస్తున్న భిన్న వైఖరులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందువులు సహా మైనార్టీలుగా ఉన్నవారిని గుర్తించడంపై రాష్ట్ర ప్రభుత్వాలతో మూడు నెలల్లోగా సంప్రదింపులు జరపాలని జస్టిస్‌   కౌల్, జస్టిస్‌ సుందరేశ్‌లతో కూడిన∙బెంచ్‌ కేంద్రాన్ని ఆదేశించింది. అల్ప సంఖ్యాకులైన హిందువులు, ఇతర వర్గాలకు మైనార్టీ హోదాను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని కేంద్రం మార్చిలో పేర్కొంది. కానీ మైనార్టీ హోదా ఇవ్వడంపై కేంద్రానికే సర్వాధికారాలు న్నాయని సోమవారం కోర్టుకు నివేదించింది. 

మరిన్ని వార్తలు