హోలీ ముందుగానే వచ్చింది, 2024లోనూ ఇదే రిపీట్‌ అవుద్ది: మోదీ

10 Mar, 2022 20:22 IST|Sakshi

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు హోలీ పండుగ ముందుగానే వచ్చిందని అన్నారు. ప్రజల అఖండ మద్దతే ఈ విజయానికి కారణమన్నారు.  బీజేపీ నిర్ణయాలు, విధానాలపై నమ్మకం పెరిగిందని,  బీజేపీ స్థానాల సంఖ్య పెరిగిందని తెలిపారు.

మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని, తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. గోవాలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయన్న మోదీ.. గోవా ప్రజలు బీజేపీకి మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. యూపీలో ఐదేళ్లపాటు ప్రభుత్రాన్ని నడిపిన సీఎంను.. ప్రజలు మళ్లీ గెలిపించడం ఇదే తొలిసారన్నారు. 

‘ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలనతీరును మెచ్చి ప్రజలిచ్చిన తీర్పు. పేదరికం నిర్మూలన అంటూ చాలా నినాదాలు, స్కీమ్‌లు వచ్చాయి. కానీ పేదరికం తొలగిపోలేదు. మేం ఆ దిశగా ప్రణాళికతో పనిచేశాం. పేదలకు ప్రభుత్వ పథకాలు అందే వరకు నేను వదిలిపెట్టను. చివరి పేదవాడి వరకు ప్రభుత్వ పథకాలు అందాలి. నిజాయితీతో పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా సాధ్యమవుతుంది.
చదవండి: ‘హస్త’వ్యస్తం.. చివరికి మిగిలింది ఆ ‘రెండే’..  

మహిళలు అధికంగా ఓట్లేసిన చోట బీజేపీ బంపర్‌ విక్టరీ కొట్టింది. నాకు స్త్రీశక్తి అనే కవచం లభించింది. కులాల పేరుతో ఓట్లు అడిగి కొన్ని పార్టీలు యూపీ ప్రజల్ని అవమానించారు. యూపీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. కులం, జాతి అనేది దేశ ప్రగతికి ఉపయోగపడాలి కానీ, విచ్ఛిన్నానికి కాదు. యూపీ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్‌ను ఫిక్స్‌ చేశాయి. ఇవే ఫలితాలు 2024లోనూ రిపీట్‌ అవుతాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు