ప్రముఖులపై కరోనా పంజా

3 Aug, 2020 04:14 IST|Sakshi

న్యూఢిల్లీ/బెంగళూరు/లక్నో: కరోనా మహ మ్మారి అత్యంత ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్, కర్ణాటక సీఎం యెడియూరప్ప తాజాగా కరోనా బారినపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ మంత్రి కరోనా వల్ల కన్నుమూశారు.  

అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌
తనలో కరోనా వైరస్‌ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(55) ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు.  అమిత్‌ షా ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ సుశీల్‌ కటారియా పర్యవేక్షిస్తున్నారు. మేదాంత ఆసుపత్రిలోకి ఇతరులు రాకుండా నిషేధం విధించారు. అమిత్‌ షాను ఇటీవలే తాను కలిశానని కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో చెప్పారు.

అతి త్వరలో కరోనా టెస్టు చేయించుకుంటానని, అప్పటిదాకా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంటానని తెలిపారు. అమిత్‌ షాను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన ఇటీవలే కేబినెట్‌ భేటీలో పాల్గొన్నారు. అమిత్‌ షా త్వరగా కోలుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌  నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,  బెంగాల్‌ సీఎం మమత, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, హరియాణా సీఎం  ఖట్టర్‌ ఆకాంక్షించారు.     

యెడియూరప్ప కూడా..
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్పకు కరోనా వైరస్‌ సోకింది. ఆదివారం ఆయనకు పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. యెడియూరప్ప చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తనను కలిసినవారు కరో నా టెస్టు చేయించుకోవాలని, హోం ఐసో లేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.   ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ కూడా కరోనా బారినపడ్డారు.   

కరోనాతో యూపీ మంత్రి  మృతి
యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62)ని కరోనా  పొట్టన పెట్టుకుంది. ఆమె ఆదివారం లక్నో లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశా రు. రాష్ట్రంలో కరోనా వల్ల ఒక మం త్రి మరణించడం ఇదే తొలిసారి. యూపీ కేబినెట్‌లో ఆమె ఏకైక మహిళ. కమల్‌రాణికి జూలై 18న పరీక్షలు చేయ గా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె  డయాబెటిస్, హైపర్‌ టెన్షన్, హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

కరోనా బారిన తమిళనాడు గవర్నర్‌
సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు(80) కరోనా వైరస్‌ సోకింది. ఆయనలో కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని కావేరీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో ముగ్గురికి కరోనా సోకడంతో గవర్నర్‌ పురోహిత్‌ జూలై 29 నుంచి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు.  ఒక వైద్య బృందం ఎప్పటికప్పుడు గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌లో కరోనా లక్షణాలు బయటపడలేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశాయి.   

>
మరిన్ని వార్తలు