కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమానం దారిమళ్లింపు.. అసోంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

5 Jan, 2023 07:01 IST|Sakshi

గువాహటి: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రయాణిస్తున్న విమానాన్ని దారిమళ్లించారు అధికారులు. అసోంలోని గువాహటి లోక్‌ప్రియా గోపినాథ్‌ బర్దోలాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి 10.45 గంటలకు అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. త్రిపురలోని అగర్తలాకు వెళ్లున్న హోంమంత్రి అమిత్‌ షా విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ చేయలేకపోయారు. దీంతో విమానాన్ని అసోంకి మళ్లించి సురక్షితంగా కిందకు దించారు. 

విమానం అత్యవసర ల్యాండింగ్‌ చేపట్టిన క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గువాహటిలోని హోటల్‌ రాడిసన్‌ బ్లూకు చేరుకుని బుధవారం రాత్రి బస చేశారు అమిత్‌ షా. వాతావరణ పరిస్థితులపై అనుమతులు వచ్చిన తర్వాత గురువారం ఉదయం అగర్తలాకు బయలుదేరి వెళ్తారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చేపట్టనున్న రథయాత్రను ప్రారంభించేందుకు వెళ్తున్నారు షా. ఈ రథయాత్రతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 

ఇదీ చదవండి: రామ్‌పూర్‌ ప్రత్యేక కోర్టులో జయప్రద

మరిన్ని వార్తలు