బీఎస్‌ఎఫ్‌ డీజీగా పంకజ్‌ కుమార్‌

26 Aug, 2021 06:22 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా 1988 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్‌ పంకజ్‌ కుమార్‌ సింగ్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీఎస్‌ఎఫ్‌ డీజీ విధులతో పాటు ఐటీబీపీ డీజీగా పని చేస్తున్న ఎస్‌ఎస్‌ దేశ్‌వాల్‌ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం పంకజ్‌ కుమార్‌ బాధ్యతలు చేపడతారని కేంద్రం ప్రకటించింది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల వెంట 6,300 కిలోమీటర్లకు పైగా సరిహద్దులను బీఎస్‌ఎఫ్‌ జవాన్లే చూసుకుంటున్నారు. బీఎస్‌ఎఫ్‌లో సుమారు 2.65 లక్షల మంది సైనికులు ఉన్నారు. పంకజ్‌ కుమార్‌ తండ్రి ప్రకాశ్‌ సింగ్‌ కూడా ఐపీఎస్‌ ఆఫీసరే కావడం గమనార్హం. ఆయన కూడా గతంలో బీఎస్‌ఎఫ్‌ డీజీగా పని చేశారు. పంకజ్‌తో పాటు తమిళనాడు కేడర్‌కు చెందిన 1988 ఐపీఎస్‌ బ్యాచ్‌ ఆఫీసర్‌ సంజయ్‌ ఆరోరాను ఐటీబీపీ డీజీగానూ, ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన బాలాజీ శ్రీవాస్తవ్‌ను బ్యూరో ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌డీ)గా నియమించింది.

మరిన్ని వార్తలు