ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్యలో ఉగ్రకోణం?.. హోం శాఖ కీలక ఆదేశాలు

29 Jun, 2022 12:17 IST|Sakshi

Udaipur Tailor Murder: రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్య కేసుపై దేశవ్యాప్తంగా స్పందన పెరిగిపోతుండగా.. మరోవైపు చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది. ఈ తరుణంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. బుధవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తం అవుతున్నందున.. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణకు ఆదేశించింది. 

టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్యోదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కస్టమర్లలాగా నటిస్తూ కొలతలు ఇస్తుండగానే.. కన్హయ్య  గొంతు కోసి హత్య చేస్తూ వీడియో వైరల్‌ చేయడం, ఆపై ప్రధానికి సైతం హెచ్చరికలు జారీ చేసిన వీడియోలు వైరల్‌ కావడం తెలిసిందే. ప్రవక్తపై నూపర్‌ కామెంట్ల వివాదం తర్వాత.. నూపుర్‌కు మద్ధతుగా కన్హయ్య పోస్టులు పెట్టినందుకే ఈ హత్య జరిగనట్లు నిందితుల వీడియో ద్వారా స్పష్టమైంది. మరోవైపు .. సదరు వీడియోలను తొలగించాలంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఇంకోవైపు ఉగ్ర కోణం నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో ప్రకటించింది కూడా. ఏదైనా సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ లింకులు క్షుణ్ణంగా పరిశోధించబడతాయి అని ట్వీట్‌లో పేర్కొంది.

ఇక ఘటన  గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఐజీ స్థాయి అధికారితో పాటు ఎన్‌ఐఏ బృందం ఒకటి మంగళవారమే ఉదయ్‌పూర్‌కు చేరుకుని పరిశీలించింది. తాజా సమాచారం ప్రకారం.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉదయ్‌పూర్‌ ఘటనపై ఎన్‌ఐఏ బృందం కేసు నమోదు చేయొచ్చని తెలుస్తోంది. 

చదవండి: అచ్చం ఐసిస్‌ తరహాలో క్రూరంగా కన్హయ్య గొంతు కోశారు

మరిన్ని వార్తలు