రేప్‌ కేసుల విచారణ 2నెలల్లో..

11 Oct, 2020 04:42 IST|Sakshi

ఎఫ్‌ఐఆర్‌ నమోదు తప్పనిసరి

హోంశాఖ నూతన మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో చట్ట ప్రకారం రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేసి, చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దారుణాలు, హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఈమేరకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. మేజిస్ట్రేట్‌ ఎదుట బాధితురాలి మరణ వాంగ్మూలం రికార్డు చేయలేదన్న నెపంతో, మరణవాంగ్మూలాన్ని విస్మరించరాదని కేంద్రం తన మార్గదర్శకాల్లో తేల్చి చెప్పింది.

సీఆర్‌పీసీ ప్రకారం నేరం జరిగిన వెంటనే తప్పకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగదని, కనుక పోలీసులు నేరం జరిగినట్టు ఫిర్యాదు అందిన తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంది. ఒకవేళ నేరం జరిగిన ప్రాంతం సదరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనికి రాకపోయినప్పటికీ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంది. పోలీసులకు చట్టాలను గురించి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వాటిని విచారించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది.  సీఆర్‌పీసీ సెక్షన్‌ 173 అత్యాచారం కేసుల్లో విచారణ రెండు నెలల్లో ముగించాలని చెపుతోందని, సీఆర్‌పీసీ సెక్షన్‌ 164–ఎ ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలిని ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు గుర్తింపు కలిగిన వైద్యులచే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హోం శాఖ తెలిపింది.

సాక్ష్యాల చట్టం–1872 ప్రకారం, చనిపోయిన వ్యక్తి మరణానికి ముందు రాతపూర్వకంగా గానీ, నోటి మాట ద్వారాగానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని నిజమని నమ్మితీరాలని, విచారణలో అది తొలిసాక్ష్యమని చెపుతోంది. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ (ఎస్‌ఏఈసీ) కిట్లను వాడేందుకు పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, వైద్య సిబ్బందికి శిక్షణనిస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. విచారణను ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టం ఫర్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (ఐటీఎస్‌ఎస్‌ఓ) ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలంది. పదే పదే అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయిలోని డేటాబేస్‌ని వాడుకోవాలని తెలిపింది. అత్యాచార నేరాలను విచారించేందుకు కేంద్రం, కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధిలో చార్జ్‌షీట్‌ దాఖలయ్యేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు