హోం క్వారంటైన్‌ ఇక ఏడు రోజులే

6 Jan, 2022 04:12 IST|Sakshi

ఏ లక్షణాలు లేని కరోనా రోగులకు హోం ఐసోలేషన్‌ను కుదించిన కేంద్రం

ఏడు రోజులయ్యాక ఎలాంటి టెస్టూ అక్కర్లేదు... నెగెటివ్‌గా పరిగణన

కొత్త మార్గదర్శకాలు జారీ  

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు విస్తృతంగా వ్యాపిస్తూ థర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం క్వారంటైన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వేరియెంట్‌ ప్రమాదకారి కాకపోవడంతో హోం క్వారంటైన్‌ వ్యవధిని 10 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించింది. కోవిడ్‌–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారికి హోం క్వారంటైన్‌ కాల పరిమితిని తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన  దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది. వైద్యుడిని సంప్రదించకుండా సీటీ స్కాన్, ఎక్స్‌రేలు, రక్త పరీక్షలు చేయించుకోవద్దని హితవు చెప్పింది. వైద్యులు చెప్పకుండా సొంతంగా స్టెరాయిడ్స్‌ వంటివి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది.

► ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై స్వల్ప లక్షణాలు, లేదంటే అసలు లక్షణాలు లేకపోతే వారు హోం క్వారంటైన్‌ ఉంటే సరిపోతుంది.
► కరోనా సోకిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే మాస్కులు ధరించి వారు బయట తిరగవచ్చు.  
► స్వల్ప లక్షణాలున్న వారు హోం క్వారంటైన్‌ ముగిసిన తర్వాత తిరిగి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవిడ్‌–19 నెగెటివ్‌గానే వారిని పరిగణిస్తారు.
► 60 ఏళ్ల వయసు పైబడి గుండె, కిడ్నీ వంటి వ్యాధులున్న వారు వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉండాలి.  
► హెచ్‌ఐవీ, కేన్సర్‌ రోగులు మాత్రం కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలి
► జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు హోం క్వారంటైన్‌ కేసుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలి.
► క్షేత్ర స్థాయిలో ఎఎన్‌ఎం, శానిటరీ ఇన్‌స్పెక్టర్, మల్టీపర్పస్‌ హెల్త్‌వర్కర్‌తో కూడిన కోవిడ్‌ బృందాలు హోం క్వారంటైన్‌ రోగుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి.
► రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఆధారంగా ఈ బృందాలు రోగులకు కరోనా కిట్లను అందించాలి.

డేంజర్‌ బెల్స్‌
భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని సూచించే ఆర్‌–వాల్యూ ప్రస్తుతం ఏకంగా 2.69కు చేరింది. డెల్టా వేరియెంట్‌ కారణంగా సెకండ్‌ వేవ్‌ అత్యంత ఉధృతంగా ఉన్నపుడు సైతం గరిష్ట ఆర్‌– వాల్యూ 1.69 శాతమేనని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు. నగరాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఒమిక్రానే ప్రధాన వేరియెంట్‌గా అవతరించిందని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటాన్ని నివారించాలన్నారు.   

మరిన్ని వార్తలు