జువెనైల్‌ హోమ్‌లో అమానుషం.. పిల్లలను చెప్పుతో కొట్టి, మంచానికి కట్టేసి..

14 Sep, 2023 14:51 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. జువెనైల్‌ హోమ్‌లో పిల్లలకు రక్షణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి వారిపై చేయి చేసుకుంది. చిన్న పిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొట్టింది.

ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. మహిళా సూపరింటెండెంట్‌ చిన్నారులను కొడుతున్న దృశ్యాలు జువెనైల్‌ హోమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ గదిలో ఆరుగురు చిన్నారులు బెడ్స్‌ మీద పడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చిన సూపరిండెండ్‌ పాల్‌ ఇతర ఉద్యోగులు చూస్తుండానే ఒక్కసారిగా ఓ చిన్నారిపై దాడి చేసింది. చెప్పుతో పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. మిగతా పిల్లలను కూడా తిడుతుండటం వీడియోలో కనిపిస్తుంది.

అదే జువెనైల్‌ హోమ్‌లో నుంచి మంగళవారం మరో వీడియో బయటకు వచ్చింది. ఇందులో మళ్లీ సూపరిండింట్‌ ఏడేళ్ల వయస్సున్న ఓ అమ్మాయి చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి పడుకోబెట్టింది. విడిపించుకనేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. మంచం కిందకు జారిపోతుంది. ఈ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారి ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జువెనైల్‌ హోమ్‌లో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సందరు  సూపరింటెండెంట్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరించిన హోమ్‌ సూపరింటెండెంట్‌ పూనమ్‌ పాల్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.  అంతేగాక కొన్ని రోజుల క్రితం ఆ హోమ్‌లో ఓ చిన్నారి ఆత్మహత్యకు సైతం ప్రయత్రించింది. కాగా పూనమ్‌ పాల్‌ గతంలోప్రయాగ్‌ రాజ్‌లో పనిచేసింది. అక్కడ కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది.

ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్,ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమెపై  ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ అయ్యిందని కఠిన  చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు