రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్‌ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు

26 Oct, 2022 12:07 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌ ఎక్కించిన ప్రైవేటు ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్‌ ఎక్కించడంతో బాధితుడు చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రోగి ప్రాణాలు కోల్పోయాడని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ  ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఘటనలో తాజాగా సదరు ఆసుపత్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం నాటికి భవనాన్ని ఖాళీ చేయాలని లేదంటే బుల్డోజర్‌తో కూల్చివేస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డెంగ్యూ రోగి చనిపోయిన కేసు ప్రాథమిక విచారణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడటంతో గత వారమే ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో రోగులు లేరు.

అయితే గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆసుపత్రి అధికారులు సమాధానం ఇవ్వలేదని తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు డెంగ్యూ రోగి మరణం అనంతరం ప్రయాగ్‌రాజ్ పోలీసులు నకిలీ ప్లేట్‌లెట్స్ సరఫరా చేసే ముఠాను ఛేదించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్‌ చేసినట్లు ప్రయాగ్‌రాజ్‌ ఎస్పీ శైలేష్‌ కుమార్‌ పాండే తెలిపారు. నిందితుల నుంచి కొన్ని నకిలీ ప్లేట్‌లెట్‌ పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.  
చదవండి: ‘ఏయ్‌ ఐటమ్‌. ఎక్కడికి వెళ్తున్నవ్‌’.. పోకిరికి బుద్ధి చెప్పిన కోర్టు

మరిన్ని వార్తలు