ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

20 Jul, 2022 10:20 IST|Sakshi

న్యూఢిల్లీ: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది ఒప్పుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ నడి రోడ్డుపైనే బిడ్డకు జన‍్మనిచ్చింది. ఈ అమానవీయ సంఘటన దిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆసుపత్రి వద్ద మంగళవారం జరిగింది. రోడ్డుపై కొందరు మహిళలు చీరలు అడ్డుపట్టగా.. మహిళకు పురుడు పోసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఈ సంఘటనపై నివేదిక అందించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీనిపై ఆసుపత్రి సైతం దర్యాప్తు చేపట్టింది. 

ఆ వీడియోలో.. కొందరు మహిళలు చీరలు పట్టుకుని గర్భిణీ చుట్టు నిలుచున్నారు. అక‍్కడ కొందరు నర్సులు సైతం ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఆసుపత్రికి రాగా చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించినట్లు బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. అత్యవసర విభాగం ఎదుటే రాత్రంత ఉన్నామని వాపోయారు. ఈ విషయంపై నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

గాజియాబాద్‌లోని ఖేరా ప్రాంతానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను సఫ్దార్‌గంజ్‌ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్‌ మనోజ్‌ తెలిపారు. ‘ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరించటం వల్ల రోడ్డుపైనే పాపకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం శిశువును, మహిళను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇరువురు ఆరోగ్యంగా ఉన్నారు.  అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ఆసుపత్రికి ఢిల్లీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. జులై 25లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు

మరిన్ని వార్తలు