హోటల్‌ ఫుడ్‌ ఇక మరింత ప్రియం.. 30 శాతం మేర పెరగనున్న ధరలు

11 Nov, 2021 15:03 IST|Sakshi

30 శాతం మేర పెరగనున్న ఆహారపదార్థాల ధరలు 

పెట్రోధరలు, నిత్యావసర ధరల పెరుగుదల ఫలితం 

ధరలు పెంచకపోతే వ్యాపారాలు నిర్వహించలేని పరిస్థితి 

‘ఆహార్‌’ సంఘటన అధ్యక్షుడు శివానంద్‌ శెట్టి  

సాక్షి, ముంబై: రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు మరింత ప్రియం కానున్నాయి. త్వరలో 30 శాతం మేర ధరలు పెరగనున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతో రవాణా ఖర్చులూ పెరుగుతుండటం, దానికి తోడు కూరగాయల ధరలు, వంట గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని ‘ఆహార్‌’ సంఘటన అధ్యక్షుడు శివానంద్‌ శెట్టి పేర్కొంటున్నారు.  దీంతో సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు హోటల్‌కు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.  

‘కరోనా’ నుంచి కోలుకోకముందే 
కరోనా సంకట కాలంలో హోటల్‌ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల మధ్య హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినప్పటికీ అనుకున్న మేర లాభాలు కాదుకదా కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ఖర్చులు పెరిగి, ఆదాయం గణనీయంగా తగ్గడంతో వ్యాపారులు ఆర్థికంగా భారీ దెబ్బతిన్నారు. ఈ ఏడాది మే, జూన్‌ తర్వాత దశల వారీగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో హోటల్‌ వ్యాపారాలు మెల్లమెల్లగా పుంజుకోసాగాయి. అయితే గతేడాది చవిచూసిన నష్టాన్ని పూడ్చుకోవాలని హోటల్‌ వ్యాపారులు భావించారు. కానీ ధరలు పెంచితే మొదటికే మోసం వస్తుందని భావించి పాత ధరలతోనే నెట్టుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం పెట్రో ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఆహారపదార్థాల ధరలను కనీసం 30 శాతం పెంచక తప్పని పరిస్థితి నెలకొందని శివానంద్‌ అంటున్నారు. 

చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్‌ అడిగిన ముగ్గురి అరెస్టు!) 

పెరిగిన ధరలు 
హోటల్, రెస్టారెంట్లు, క్యాంటీన్లలో గ్యాస్‌ సిలిండర్‌ వినియోగం తప్పనిసరి. స్టార్‌ లేదా పెద్ద హోటళ్లలో రోజుకు ఐదు సిలిండర్లు, చిన్న హోటళ్లలో రోజుకు రెండు గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తుంటారు. ఆయా వ్యాపార సంస్థలు వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌కు ఇళ్లలో వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ కంటే ఎక్కువే చెల్లిస్తారు. అవి కూడా పెరగడంతో ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోవడంతో రవాణా చార్జీలు పెరిగాయి. విద్యుత్‌ బిల్లులు, కార్మికులు, సిబ్బంది వేతనాలు, సామగ్రి కొనుగోలు ఖర్చు అన్నీ పెరగడంతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

ప్రతీ హోటల్‌కు గ్రేడ్‌ను బట్టి ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. అదే తరహాలో మెనూ ధరలు కూడా వేర్వేరుగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్లలలో మెనూ చార్జీలు పెంచాల్సి వస్తోందని శివానంద్‌ స్పష్టం చేశారు. లేకపోతే హోటళ్లు, రెస్టారెంట్లు నడపలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే 30 శాతం ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది త్వరలో హోటల్, రెస్టారెంట్ల యజమానులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు