వెళ్తూ వెళ్తూ దాదాపు 14 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన కర్ణాటక మాజీ సీఎం

27 Jul, 2021 17:05 IST|Sakshi

బెంగళూరు: క‌ర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇదివరకే రాజీనామా చేసిన యడియూరప్ప… వెళ్తు వెళ్తు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాజీనామాకు కొద్ది గంటల ముందు ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల మూల‌వేత‌నంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూల‌వేత‌నంలో 11.25 శాతంగా ఉంది. ఇప్పుడు అది ఏకంగా 21.50కు చేరింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. యడ్డీ నిర్ణయంతో రాష్ట్రంలోని 6 ల‌క్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 ల‌క్షల మంది పెన్షన‌ర్ల‌తో పాటు వివిధ‌ పీఎస్‌యూలు, కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేసే దాదాపు 3 ల‌క్షల మంది ఉద్యోగుల‌కు లబ్ధి చేకూర‌నుంది. 

కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనుంది. ఇప్పటికే పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్‌రెడ్డిలని నియమించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రేపేమాపో కర్ణాటక కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అంతవరకు ఆప‌ద్ధర్మ ముఖ్యమంత్రిగా గవర్నర్‌ వ్యవహరించనున్నారని తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు