శునకాలకు అన్నం పెట్టి.. జైలు పాలయ్యాడు!

27 Mar, 2022 07:35 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై : కుక్కలకు ఆహారం పెట్టే విషయంలో చోటు చేసుకున్న గొడవ కారణంగా ఓ ఇంటి యజమాని హత్యకు గురయ్యాడు. ఇక మానవత్వంతో వ్యవహరించిన పుణ్యానికి ఓ కార్మికుడు జైలు పాలయ్యాడు. వివరాలు.. చెన్నై కొరుక్కు పేట జేజే నగర్‌కు చెందిన సురేష్‌కుమార్‌(29) కూలి కార్మికుడు. ఇతడికి వీధి శునకాలకు ఆహారం పెట్టడం అంటే, ఎంతో ఇష్టం. రోజూ తన సంపాదనలో కొంత మొత్తాన్ని వీధి శునకాలకు వెచ్చించే వాడు. రోజూ రాత్రి వేళల్లో ఆకలితో ఉండే శునకాల్ని గుర్తించి ఆహారం పెట్టే వాడు.

ఆ దిశగా శుక్రవారం రాత్రి ఓ చోట శునకాలు ఉండడంతో అక్కడి ఓ ఇంటి వద్ద ఆహారాన్ని ఉంచాడు. దీంతో అక్కడున్న శునకాలు ఆహారం కోసం పోటీ పడ్డాయి. అదే సమయంలో ఆ ఇంటి యజమాని గోవిందరాజ్‌(40) అక్కడకు వచ్చి శునకాల్ని తరిమే యత్నం చేశాడు. సురేష్‌కుమార్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శునకాల్ని తరిమేస్తావా..? అంటూ గోవిందరాజ్‌ను సురేష్‌ తోసేశాడు. కింద పడ్డ గోవిందరాజ్‌ తల పగిలి మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గోవిందరాజ్‌ను హతమార్చిన నేరానికి సురేష్‌కుమార్‌ను అరెస్టు చేసి శనివారం  రిమాండ్‌కు తరలించారు.  

చదవండి: (30 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా ఎవర్‌గ్రీన్‌ జోడి) 

మరిన్ని వార్తలు