వారి వినతి మేరకే పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా.: మంత్రి ప్రహ్లాద్‌ జోషి

10 Aug, 2022 11:30 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ఎంపీల వినతి మేరకే షెడ్యూల్‌కు రెండు రోజులు ముందుగానే నిరవధికంగా వాయిదా వేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలను షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్‌ 12 కంటే ముందుగానే ముగించడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, సభను నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కాంగ్రెస్‌ పార్టీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

సభలో చర్చ జరగాలంటూ బయటకు చెప్పుకుంటూ అంతరాయం కలిగించడం, వాకౌట్‌ చేయడం ప్రతిపక్షాల ఎజెండాగా మారిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా వర్షాకాల సమావేశాలను షెడ్యూల్‌ కంటే 4 రోజులు కాదు, 2 రోజులు ముందుగా వాయిదా వేశాం. ప్రతిపక్ష సభ్యులు సహా పలువురు ఎంపీలు చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని పేర్కొన్నారు.
చదవండి: నితీశ్‌కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ

దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ సభలో కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందిస్తూ..‘అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక కుటుంబం వ్యక్తిగత సమస్యలపై పార్లమెంట్‌ సమయాన్ని వృథా చేశారు. ప్రజాప్రయోజనాల కంటే ఒక కుటుంబాన్ని రక్షించడానికే ఎక్కువ ఆసక్తి చూపారు’అని ఎత్తిపొడిచారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, రాహుల్‌ని ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.   
చదవండి: నలుగురికి కోవిడ్‌ పాజిటివ్‌.. భారత పర్యాటకులపై నేపాల్‌ నిషేధం 

మరిన్ని వార్తలు