Taukte Cycole: ముంబైని అతలాకుతలం చేసిన తుపాను

18 May, 2021 14:51 IST|Sakshi

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ప్రారంభమైన టౌటే తుపాను సోమవారం నాటికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదులు గాలులు వీచాయి. తుపాను గుజరాత్‌ తీరం వైపు కదలుతున్న క్రమంలో ముంబైలో భారీ నష్టాన్ని మిగిల్చింది. తుపాను మూలంగా భారీ ఈదురు గాలులు ముంబై నగరాన్ని తాకడంతో సిటీలోని అతి పెద్ద వ్యాక్సినేషన్‌ సెంటర్‌ అయిన బీకేసీ భారీ నష్టాన్ని చవి చూసింది. టౌటే తుపాను కారణంగా ముంబైలో 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలో ఇంత భారీ వర్షపాతం నమోదవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం అని ఓ వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు.

భారీ వర్షం కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.. వీధులు నీటితో నిండిపోయాయి. నగరం అంతట పగటిపూట భారీ వర్షపాతం, బలమైన ఈదురు గాలులు వీచాయి. రాబోయే 24 గంటల్లో ముంబై, శివారు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని.. గంటకు120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ మంగళవారం అంచనా వేసింది.

తుపాను ప్రభావంతో వ్యాక్సినషన్‌ కేంద్రాల్లో భారీ నష్టం చోటు చేసుకుంది. భారీ గాలుల వల్ల బీ​కేసీ, బాంద్ర కుర్ల కాంప్లెక్స్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల రూపు రేఖలు మారిపోయాయి.


భారీ వర్షం మూలంగా వీధుల్లో నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి. తూర్పు-పడమర కనెక్టివిటీకి కీలకమైన హింద్మాతా జంక్షన్, అంధేరి సబ్వే, మలాడ్ సబ్వేతో సహా ఆరు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు నిలిచిపోయిందని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు.


ముంబైలోని బాంద్ర వద్ద టౌటే తుపాను కారణంగా ముంబై, బాంద్రాలోని బాంద్రా-వర్లి సముద్ర లింక్ మూసివేశారు.


టౌటే తుపాను కారణంగా బలమైన గాలులు వీచడంతో అపార్ట్‌మెంట్‌ ఎదుట కూలిపోయిన చెట్లను తొలగిస్తున్న స్థానికులు.


భారీ వర్షం కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. బలమైన గాలుల కారణంగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌ఎంటీ) వద్ద సబర్బన్, ప్రధాన మార్గాల మధ్య సాధారణ ప్రయాణీకుల ప్రాంతం పైకప్పును కప్పి ఉంచే కొన్ని ప్లాస్టిక్ షీట్లు ఎగిరిపోయాయి.


టౌటే తుపాను వల్ల అలలు రోడ్డుపైకి దూసుకువచ్చాయి.

చదవండి: Fact Check: ఇది నిజంగా ముంబైలో జరిగిందా?

మరిన్ని వార్తలు