‘హెల్త్‌ పాలసీ’కు వారం రోజుల గడువా!?

29 Aug, 2020 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఒక్క రోజే 67 వేల కోవిడ్‌–19 కేసులు నమోదైనట్లు ఆగస్టు 26వ తేదీన కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతోపాటు దేశ ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు కోరుతూ ఓ విధాన ముసాయిదాను విడుదల చేసింది. ‘నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌’ పేరిట ప్రజారోగ్య డేటా నిర్వహణ విధానాన్ని ప్రతిపాదించింది. దానిపై ప్రజల నుంచి అభ్యంతరాలను, సూచనలను కోరుతూ కేవలం వారం రోజులే గడువును ఇచ్చింది. దీనిపై స్పందించేందుకు కేవలం వారం రోజులే గడువు ఇవ్వడం అర్థరహితమని కేంద్ర ఆరోగ్య శాఖకు సలహా సంస్థగా పని చేస్తోన్న ‘నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసోర్స్‌ సెంటర్‌ మాజీ డైరెక్టర్‌ టి.సుందరమన్‌ విమర్శించారు. ఏ విషయంలోనైనా ప్రజాభిప్రాయాన్ని కోరినట్లయతే నెల నుంచి మూడు నెలల సమయం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 15వ తేదీనా లాంచనంగా తెలియజేశారు. ఈ మిషన్‌ కింద ప్రజలందరికి ఆధార్‌ కార్డుతో లింక్‌ చేస్తూ ఆరోగ్య గుర్తింపు కార్డునొకదాన్ని అందజేస్తారు. ఆ గుర్తింపు కార్డు ద్వారా ప్రజల వ్యక్తిగత వివరాలతోపాటు వారి ఆరోగ్య వివరాలను సేకరించి డిజిటల్‌ డేటా రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఇందులో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం కూడా ముడివడి ఉంది. ప్రజల వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి సమాచారాన్ని ఎలా సేకరికస్తారో, ఎలా ప్రాసెస్‌ చేస్తారో, ఎలా నిక్షిప్తం చేస్తారో, వాటిని చివరకు ఎలా షేర్‌ చేస్తారో ! తదితర వివరాలు ఆ ప్రజారోగ్య ముసాయిదాలో లేవు.

ప్రజారోగ్య డేటాను రాష్ట్ర, కేంద్ర, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయడంతోపాటు ఉన్నత స్థాయి మొత్తం డేటాను నిక్షిప్తం చేయవచ్చు. అయితే కరోనా మహమ్మారి సమయంలో డేటాను సేకరించడం అశాస్త్రీయమని, ఆధార్‌కు వ్యతిరేకంగా పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాది ఎస్‌ ప్రసన్న వ్యాఖ్యానించారు. ఆధార్‌ కార్డు ఉండగా, మరో హెల్త్‌ ఐడీ అవసరం లేదని, ఆధార్‌ ఐడీకి ఆరోగ్య వివరాలు జత చేస్తే సరిపోతుందని సుందరమన్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు