వీధుల్లో ఉమ్మి వేయడాన్ని ఆపాలంటే..

4 Dec, 2020 15:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా పాన్‌ మసాలా, జర్దా, గుట్కాలకు దూరంగా ఉండడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మ కూడదంటూ భారత వైద్య పరిశోధన మండలి గత మార్చి నెలలో దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినట్లయితే జరిమానా విధిస్తామంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్‌ నాలుగో తేదీన ఉత్తర్వులు జారీ చేశాయి. జరిమానాను రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు పేర్కొన్నాయి. చదవండి: కోవిడ్‌ శాంపిల్‌ కోసం రోబో

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం, జూదంపై విధించిన నిషేధం నూటికి నూరు శాతం కాకపోయినా ఎక్కువ వరకు అమలవుతుండగా, ఉమ్మ కూడదన్న నిబంధన అసలు ఏమాత్రం అమలవడం లేదనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు. నోటి నిండా మీటా పాన్‌ లేదా జర్దా పాన్‌ దట్టించడం, కసాపిసా నమలి రోడ్డు పక్కనో, గోడల మీదో తుపుక్కున ఉమ్మేయడం మహా నగరాల వీదుల్లో మనకు నిత్యం కనిపించే దశ్యాలే. పాన్లు గీన్లు ఏమీ వేసుకోక పోయినా వీధుల్లో ఉమ్మడం, ముక్కులు చీదడం మనకు కొత్త కాదు. కరోనా లాంటి వైరస్‌ల ద్వారా వచ్చే అంటు రోగాలను అరికట్టడంలో భాగంగా ఉమ్మ కూడదనే నిబంధనను తీసుకొచ్చినప్పటికీ అది దేశంలో ఎక్కడా సరిగ్గా అమలు కాకపోవడానికి కారణాలేమిటీ? నిబంధనను అమలు చేయడంలో అధికారులకు చిత్తశుద్ధి లోపించడమా, ఉమ్మడం తమ స్వేచ్ఛలో భాగమని భావించే ప్రజలు తమ వైఖరిని మార్చుకోవడానికి సుముఖంగా లేకపోవడం కారణమా? మరి పౌరుల ప్రవర్తనలో ఎలా మర్పు తీసుకరావాలి?

19వ శతాబ్దంలో అమెరికాను వణికిస్తోన్న టీబీ (ఉమ్మి ద్వారానే టీబీ ఇతరులకు వ్యాపిస్తుందని తెల్సిందే)ని అరికట్టడం కోసం అక్కడి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయింది. 1910లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలోని 74 నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని నిషేధిస్తూ చట్టాలు తీసుకరాగా, చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా 34 నగరాల్లో ఏ ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదు. 13 రాష్ట్రాల్లో ఈ చట్టడం కింద ఓ 20 మందిని అరెస్ట్‌ చేయగా, ఒక్క న్యూయార్క్‌ నగరంలో 2,513 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఖ్య ఇలాంటి కేసుల్లో దేశం మొత్తం మీద అరెస్ట్‌ అయిన వారిలో 73 శాతం. ఉమ్మి వేయడాన్ని అరికట్టడం కోసం చట్టాలు తీసుకొచ్చి, అరెస్ట్‌లు చేసినంత మాత్రాన, ఉమ్మడం తమ స్వేచ్ఛలో అంతర్భాగమని భావించే ప్రజల వైఖరిలో మార్పురాదని అమెరికా ప్రజారోగ్య విభాగం నాడు అవగాహనకు వచ్చింది. 

చట్టాలతోపాటు ప్రజల్లో చైతన్యం తీసుకరావడం ఇంకా ముఖ్యమని భావించింది. ఉమ్మడం ద్వారా ఇతరులు ఆరోగ్యంగా జీవించే హక్కును కాలరాస్తున్నామన్న భావన నగర పౌరుల్లో తీసుకరావడంతోపాటు ఉమ్మక పోవడం ఓ సామాజిక బాధ్యతగా, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే పౌరులకు సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. న్యూయార్క్‌ నగరం పాలక మండలి ఆధ్వర్యాన దేశంలోని పలు నగరాలు ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి విస్తత కార్యక్రమాలను నిర్వహించింది. ఉమ్మడం, దాని పర్యవసనాల గురించి టాక్సీలపై, కార్లపై, బస్సులపై పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించింది. వీధుల్లో, ఇళ్లల్లో కరపత్రాల ప్రచారాన్ని చేపట్టింది. మొబైల్‌తోపాటు అన్ని ప్రసార, ప్రచార మాద్యమాలను ఉపయోగించుకొని ప్రచారాన్ని ఉధతం చేసింది. రోడ్లపై ఉమ్మవేసిన వారిని వార్తా పత్రికలు, ఇతర ప్రసార మాద్యమాల ద్వారా గుర్తించి వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించింది. ఉమ్మవేసే వారిని  చిన్న చూపు చూడండంటూ ప్రతి సామాజిక వర్గానికి పిలుపునిచ్చింది. జరిమానాలు విధించింది. ఈ విషయంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సంఘాలతోపాటు ఎన్జీవో సంస్థల సేవలను ఉపయోగించుకుంది. 

నాటి ఉమ్మడం వ్యతిరేక ఉద్యమంలో నేషనల్‌ ట్యూబర్‌కులోసిస్‌ అసోసియేషన్, విమెన్స్‌ హెల్త్‌ ప్రొటెక్టివ్‌ అసోసియేషన్, ఫెడరేషన్‌ ఆఫ్‌ విమెన్స్‌ క్లబ్స్‌ క్రియాశీలక పాత్ర వహించాయి. మరోపక్క మున్సిపల్‌ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడానికి ప్రత్యేక కుండీలను ఏర్పాటు చేశారు. వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందితో ప్రతి బహిరంగ ప్రదేశంలో శానిటరీ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఇలాంటి విస్తత ప్రచార కార్యక్రమాలతో మూడేళ్లలోనే ఉమ్మివేయడంపై విధించిన నిషేధాన్ని నూటికి నూరు పాళ్లు అమెరికా నగర పాలక అధికారులు విజయవంతంగా అమలు చేయగలిగారు. ఫలితంగా టీబీ వ్యాప్తిని అమెరికా ప్రజారోగ్య శాఖ అరికట్టగలిగింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా