లఖీంపూర్‌ ఖేరి కేసు: మంత్రి కొడుకు కస్టడీ.. ఇంకెన్నాళ్లు ఉంచుదాం?

13 Dec, 2022 06:51 IST|Sakshi

న్యూఢిల్లీ: లఖీంపూర్‌ ఖేరి కేసులో నిందితుడు, కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ కుమారుడు ఆశిశ్‌ మిశ్రాకు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. కేసు విచారణ లఖీంపూర్‌ ఖేరి అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టులో చాన్నాళ్లుగా కొనసాగుతుండటంపై అసహనం వ్యక్తంచేసింది.

‘212 మంది సాక్షులను విచారించాలంటున్నారు. అయితే, ఏడాదికిపైగా ఆశిశ్‌ జైలులోనే ఉన్నాడు. అతడిని ఎంతకాలం కస్టడీలో ఉంచుదాం. నిందితులకూ హక్కులుంటాయి. బెయిల్, హక్కులు వంటి అంశాల్లో సమతుల్యం పాటించాల్సిందే. ఎప్పటిలోగా కేసు విచారణ ముగిస్తారో తేల్చండి’ అని జిల్లా జడ్జిని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

రైతులపైనుంచి కారు దూసుకెళ్లాక కారులోని వ్యక్తులపై జరిగిన దాడిలో ముగ్గురు మరణించిన మరో కేసులో త్వరగా అఫిడవిట్‌ సమర్పించాలని యూపీ సర్కార్‌ తరఫున హాజరైన అదనపు మహిళా అడ్వొకేట్‌ జనరల్‌ గరిమా ప్రసాద్‌కు సూచించింది. జిల్లా కోర్టులో విచారణ డిసెంబర్‌ 16న మొదలవుతుందని గరిమా చెప్పారు.  మరోవైపు యూపీ సర్కార్‌ మాత్రం నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయొద్దంటూ కోరుతూ వస్తోంది.

మరిన్ని వార్తలు