ఆరోగ్య రంగంలో అపార అవకాశాలు

31 Mar, 2021 03:41 IST|Sakshi

నీతి ఆయోగ్‌ నివేదిక విడుదల

భారత్‌లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు

పెరుగుతున్న మెడికల్‌ టూరిజం

మెడ్‌టెక్‌ జోన్‌లో 15 వేల వెంటిలేటర్ల ఉత్పత్తి 

సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులున్నాయని, ఇందులో ఏపీలోని మెడ్‌టెక్‌ జోన్‌ కూడా ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. ఆసుపత్రులు, వైద్య పరికరాలు, వైద్య బీమా, టెలీమెడిసిన్‌ తదితర అంశాల్లో పెట్టుబడుల అవకాశాలపై రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్, సీఈవో అమితాబ్‌కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్‌ రాకేశ్‌ సర్వాల్‌లు మంగళవారం విడుదల చేశారు. మెడ్‌టెక్‌ జోన్‌ను వైద్య పరికరాల తయారీ కేంద్రంగా నీతి ఆయోగ్‌ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి చెలరేగిన సమయంలో 15,000 వెంటిలేటర్లు, 10 మిలియన్ల డయాగ్నస్టిక్‌ కిట్లు, ఐదు లక్షల ఎన్‌–95 మాస్కులు, 2 లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తైనట్లు తెలిపింది. ‘క్రిటికల్‌ కాంపొనెంట్లు తయారీ చేసే సంస్థలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నందున ఈ రంగంలో పెట్టుబడులకు మెడ్‌టెక్‌ జోన్‌ అనుకూలం’’ అని నివేదికలో పేర్కొంది.  కోవిడ్‌ సంక్షోభం విసిరిన సవాలు అనేక అవకాశాలకు దారితీయటం వల్ల ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. నివేదికలో ఇతర అంశాలివీ..    

ఆరోగ్యంతోపాటు ఉపాధి.. 
భారత్‌లో ఆరోగ్య రక్షణ రంగం 2016 నుంచి ఏటా 22% చొప్పున పెరుగుతూ వస్తోంది. ఇది 2022లో 372 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2015లో ఆరోగ్య రంగం ప్రత్యక్షంగా 4.7 మిలియన్ల మందికి ఉపాధి కల్పించగా 2022 నాటికి 7.5 మిలియన్లకు పెరుగుతుందని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) అంచనా వేసింది. ఆరోగ్య రంగం ఆదాయపరంగా, ఉద్యోగాలపరంగా అతిపెద్ద రంగాలలో ఒకటిగా మారింది. జీవనశైలి వ్యాధుల పెరుగుదల, ప్రభుత్వ –ప్రైవేటు భాగస్వామ్యం, డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం వైద్య రంగం ఎదుగుదలకు కారణం. 

చికిత్స కోసం విదేశీయుల రాక.. 
మెడికల్‌ వీసాతో 2017లో విదేశాల నుంచి 4,95,056 మంది వస్తే 2019లో 6,97,000 మంది భారత్‌కు వచ్చారు. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, ఒమన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నైజీరియా, కెన్యా, ఇరాక్‌ నుంచి ఎక్కువగా వస్తున్నారు. గుండె, ఆర్థోపెడిక్, అవయవాల మార్పిడి, న్యూరో, ఆంకాలజీ, బేరియాట్రిక్స్‌ తదితర చికిత్సల కోసం ఎక్కువ మంది విదేశీయులు వస్తున్నారు. అధునాతన వైద్య విధానాలతోపాటు ఆయుర్వేదం, యోగా ఇతర సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. 

మరిన్ని వార్తలు