57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను

2 Feb, 2021 14:24 IST|Sakshi

సింగర్‌ సునీత రెండో వివాహం చేసుకున్నప్పుడు మెచ్చుకున్న వారు కొందరైతే.. విమర్శించిన వారు చాలా మంది. ఎందుకంటే మన సమాజంలో విడాకులు తీసుకున్న పురుషుడి పట్ల ఉన్న జాలి స్త్రీ మీద ఉండదు. పాపం మగాడు ఒంటరిగా ఎలా బతుకుతాడు.. ఇంకో పెళ్లి చేసుకుంటే ఏం అవుతుంది అంటారు. అది ఏ వయసులో అయినా సరే. అదే స్త్రీ ఎంత చిన్న వయసులో ఒంటరి అయినా.. ఆమె ఇక అలానే బతకాలని అభిప్రాయపడుతుంది లోకం. ఆమె ఆశల్ని, అభిరుచులను, కలల్ని చంపుకుని పిల్లల కోసం బతకాలి తప్ప విడాకులు తర్వాత మహిళ మరో సారి పెళ్లి ఆలోచన చేయకూడదు. సమాజంలో ఎలా ఉన్నా.. ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో పిల్లలు ఒంటరి తల్లులకు మద్దతుగా నిలుస్తున్నారు. వారే దగ్గరుండి మరో వ్యక్తిని తల్లి జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఇలాంటి ఓ ఒంటరి తల్లి ప్రయాణానికి సంబంధించిన స్టోరీని హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే షేర్‌ చేసింది.
(సింగర్‌ సునీత పెళ్లి: కత్తి మహేష్‌ కామెంట్స్‌)


కిరణ్‌, టామ్‌ల ఈ లవ్‌స్టోరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వివరాలు.. కిరణ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను నా 22వ ఏట అతడి నుంచి విడిపోయాను. ఆ సమయంలో నేను అనుభవించిన బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఒక్కదాన్ని పిల్లల్ని పెంచి పెద్ద చేయగలనా.. ఈ విషయం నా పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది వంటి ఆలోనలతో డిప్రెషన్‌లోకి వెళ్లాను. రోజుల తరబడి తిండి తిప్పలు మానేసి ఓ గదికే అంకితం అయ్యాను. అలా రెండేళ్లు గడిచింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పిల్లల కోసం అయినా సరే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. విడాకులతో జీవితం ముగిసిపోలేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను’’ అన్నారు కిరణ్‌.

50 ఏళ్ల వయసులో కూమార్తె ప్రోత్సాహంతో..
‘‘చూస్తుండగానే నేను 50వ ఏట అడుగుపెట్టాను. మూడో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశాను. మంచి ఉద్యోగంలో ఉన్నాను. అలా ఓ సారి నా కుమార్తె ప్రోత్సాహంతో ఓ డేటింగ్‌ యాప్‌లో నా బయో అప్‌లోడ్‌ చేశాను. ఇన్నాళ్లు ఫ్రెండ్స్‌కి దూరంగా బతికిన నేను.. కొత్త స్నేహితులను కలుసుకోవాలని వారితో స్నేహం చేయాలని భావించాను. దాంతో 2013లో ఓకేక్యుపిడ్‌లో నా బయో షేర్‌ చేశాను. ఆ తర్వాత టామ్‌ నా జీవితంలోకి వచ్చాడు. ‘‘మీ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీతో కలిసి ఓ కప్పు కాఫీ తాగాలని కోరుకుంటున్నాను’’ అంటూ మెసేజ్‌ చేశాడు. అలా ఐదు నెలల పాటు మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకున్న మేం.. ఆ తర్వాత స్కైప్‌కి మారాం. టామ్‌ కూడా నాలానే డైవర్సీ’’ అని తెలిపారు.

నీ సంతోషమే మాకు ముఖ్యం
‘‘అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఓ సారి నేను కాలిఫోర్నియా వెళ్లాను. అప్పుడు టామ్‌ 20 గంటలు ప్రయాణం చేసి వచ్చి నన్ను కలిశాడు. మేం డిన్నర్‌కి వెళ్లాం. ఆ సమయంలో మా మాధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ ఉందని తెలుసుకున్నాం. ఇక ఒకర్నిఒకరం అర్థం చేసుకోవడం ప్రారంభించాం. ఓ ఏడాది తర్వాత టామ్‌ గురించి నా పిల్లలకు చెప్పాను. వారు నన్ను అడిగిన మొదటి ప్రశ్న.. ‘‘తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడా.. నువ్వు సంతోషంగా ఉంటావా.. నీ సంతోషమే మాకు ముఖ్యం’’ అన్నారు. ఆ తర్వాత వారు కూడా టామ్‌తో స్కైప్‌లో మాట్లాడారు. ఆ తర్వాత మేం చాలా చోట్లకు వెళ్లాం. టామ్‌ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తనతో కలిసి స్కూబా డైవింగ్‌ కూడా చేశాను అన్నారు’’ కిరణ్‌.

57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను
‘‘ఇలా ఏడాది గడిచింది. ఓ రోజు టామ్‌ నాతో ‘‘నా స్నేహితుడు మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా.. అలా అయితే ఆమెకి ప్రపోజ్‌ చేయ్‌’’ అన్నాడు అని చెప్పాడు. అంతేకాక ‘‘నువ్వు అనుభూతి చెందినప్పుడు మాత్రమే చెప్పు’’ అన్నాడు తప్ప నన్ను ఫోర్స్‌ చేయలేదు. రెండు వారాల తర్వాత నా 57వ ఏట మరోసారి ప్రేమను అనుభూతి చెందాను. తను నా ఎదుగుదలకి తోడుగా నిలిచాడు. నేను యూకేలో పీహెచ్‌డీ చేయాలనకుంటున్నట్లు తనతో చెప్పాను. తన మద్దతుతో త్వరలోనే దాన్ని పూర్తి చేయబోతున్నాను. ఒకసారి నేను తనని ‘ఎందుకు నేను అడిగేంత వరకు నువ్వు నా ఫోన్‌ నంబర్‌ అడగలేదు’’ అని ప్రశ్నించాను. దానికి అతడు ‘‘నేను ఈ విషయం నీకే వదిలేశాను. నంబర్‌ షేర్‌ చేసుకోవడం సేఫ్‌ అని ఫీలయిన నాడు నువ్వే అడుగుతావని అలాగే ఉన్నాను’’ అ‍న్నాడు. తను ఏలాంటి వాడో ఈ ఒక్క మాటతో అర్థం అవుతుంది. ఇక మా ఇద్దరికి వివాహం మీద నమ్మకం లేదు. ఇద్దరం పరస్పరం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటూ.. గౌరవించుకుంటూ జీవితం గడపాలని భావిస్తున్నాం’’ అన్నారు కిరణ్‌.

‘‘మన సంతోషాలకు వయసు అడ్డంకి కాదని నేను తెలుసుకున్నాను. ఓ మహిళ తన 50వ ఏట జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. ధైర్యంగా కలలు కనండి.. వాటి సాకారం కోసం కష్టపడండి. మరో సారి ప్రేమలో పడటానికి ధైర్యం ఉంటే చాలు.. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి’’ అంటూ చెప్పుకొచ్చారు కిరణ్‌. ఇక స్టోరి ఎందరినో కదిలించింది. చాలా మంది నెటిజనులు ‘‘మీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌.. విమర్శలను పట్టించుకుంటే జీవితంలో ముందుకు సాగలేం’’.. ‘‘క్యూట్‌ లవ్‌ స్టోరి’’ అంటూ ప్రశంసిస్తున్నారు. 

 

>
మరిన్ని వార్తలు