రైతు పోరాటం ఉధృతం

31 Jan, 2021 04:15 IST|Sakshi
శనివారం ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద ఆందోళనలో పాల్గొన్న రైతులు

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు తీవ్రతరం

పోరాటంలోకి యూపీ, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ రైతాంగం

‘సద్భావన దివస్‌’గా పాటించిన రైతు సంఘాలు

బోర్డర్‌ పాయింట్ల వద్ద దీక్షలు

ట్రాక్టర్‌ పరేడ్‌లో హింస తర్వాత కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ ఉధృతం అవుతోంది. ఇప్పటివరకు పంజాబ్, హరియాణా రైతులే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించగా.. ఇప్పుడు పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్‌ రైతులు కూడా వీరికి జత కలిశారు.

ఘజియాబాద్‌/న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్‌ పరేడ్‌లో హింస చోటుచేసుకున్న తర్వాత కొంత బలహీనపడినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ తీవ్రతరమవుతోంది. ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులే ఇప్పటివరకు ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తుండగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్‌ రైతులు కూడా తోడవుతున్నారు. ఢిల్లీ–మీరట్‌ రహదారిపై ఉన్న ఘాజీపూర్‌ మరో ప్రధాన కార్యక్షేతంగా మారిపోయింది. ఢిల్లీలో హింస తర్వాత స్వస్థలాలకు తిరిగి వెళ్లిన  పంజాబ్, హరియాణా రైతులు మళ్లీ వెనక్కి వస్తున్నారు. సింఘు, టిక్రీ బోర్డర్‌ పాయింట్లకు చేరుకుంటున్నారు. రైతుల నిరసన కేంద్రాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పారా మిలటరీ దళాలనుమోహరించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులోని ముజఫర్‌నగర్‌లో శనివారం మహాపంచాయత్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.  

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా రైతు సంఘాల నాయకులు శనివారం ‘సద్భావన దివస్‌’గా పాటించారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌ పాయింట్ల వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. ఘాజీపూర్‌లో బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు నెలలకుపైగా తమ పోరాటం కొనసాగుతోందని, ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమం బలంగా ఉందని బీకేయూ మీరట్‌ జోన్‌ అధ్యక్షుడు పవన్‌ ఖటానా చెప్పారు. రైతుల శాంతియుత పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని స్పష్టం చేశారు.

సర్కారు వైఖరి మారాలి
రైతుల ఆందోళన నానాటికీ బలం పుంజుకుంటోందని సంయుక్త కిసాన్‌ మోర్చా సీనియర్‌ సభ్యుడు అభిమన్యు కోహర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంతోమంది తమ పోరాటంలో భాగస్వాములవుతారని చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకుంటారని అంచనా వేస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌(రాజేవాల్‌) అధ్యక్షుడు బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌ పేర్కొన్నారు. ఆయన చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ నుంచి రికార్డు స్థాయిలో రైతులు దేశ రాజధానికి వస్తారని వెల్లడించారు.

తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతోందని ఉద్ఘాటించారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం దారుణమని విమర్శించారు. జనవరి 26 నాటి హింసాత్మక దృశ్యాలను ప్రభుత్వం పదేపదే చూపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని రాజేవాల్‌ మండిపడ్డారు. కేంద్ర సర్కారు ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలని, కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని హితవు పలికారు. మళ్లీ చర్చల కోసం ప్రభుత్వం పిలిస్తే తప్పకుండా వెళ్తామన్నారు. ఢిల్లీలో జరిగిన హింసపై పోలీసులు జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇస్తామని చెప్పారు.

తికాయత్‌ కన్నీళ్లు కదిలించాయి
ప్రముఖ రైతు, ఉద్యమ నాయకుడు మహేంద్రసింగ్‌ తికాయత్‌ తనయుడు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ నేతృత్వంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతాంగం సంఘటితమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అవిశ్రాంతంగా సాగిస్తున్న ఆందోళనలు, నిరసనలు, ఢిల్లీలో హింస తదితర పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాత్రి ఘాజీపూర్‌ వద్ద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కన్నీళ్లు వేలాది మంది రైతులను కదిలించాయి. తికాయత్‌కు మద్దతుగా శనివారం ఆయన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ నుంచి భారీ సంఖ్యలో రైతులు ఘాజీపూర్‌కు తరలివచ్చారు. గురువారం రాత్రి తికాయత్‌ విలపించిన తర్వాత తమ కళ్లల్లోనూ నీళ్లు వచ్చాయని, ఆ రాత్రంతా తాము నిద్రపోలేదని, టీవీలకే అతుక్కుపోయామని చారౌర గ్రామ పెద్ద పంకజ్‌ ప్రధాన్‌ చెప్పాడు. తికాయత్‌ కన్నీళ్లే తనను ఇక్కడికి తీసుకొచ్చాయని యూపీలోని బులంద్‌షహర్‌కు చెందిన అనిల్‌ చౌదరి తెలిపాడు.

1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ
రిపబ్లిక్‌ డే రోజు రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో హింసాకాండపై ప్రజల నుంచి పోలీసులకు ఇప్పటిదాకా 1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ అందాయి. ఫోరెన్సిక్‌ నిపుణులు వీటిని విశ్లేషిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ హింసాకాండకు సంబంధించి 9 కేసులు నమోదుచేశారు. వీటిపై క్రైం బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తోంది. ఫోన్‌ కాల్స్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాక్టర్‌ పరేడ్‌ను 9 డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. వీటిపై అధికారులు దృష్టి పెట్టారు.  

ఇంటర్నెట్‌ బంద్‌
దేశ రాజధానిలో జనవరి 26న హింస చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా ఢిల్లీ సరిహద్దులోని రైతుల నిరసన కేంద్రాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌ పాయింట్లతోపాటు సమీప ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. జనవరి 29 రాత్రి 11 గంటల నుంచి 31వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హరియాణా ప్రభుత్వం 14 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను ఇప్పటికే రద్దు చేసింది.

మరిన్ని వార్తలు