బ్యాగులో కోతుల కళేబరాలు: మాంసం కోసం..

22 Mar, 2021 13:54 IST|Sakshi
కోతుల కళేబరాలను పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది

భువనేశ్వర్‌ : వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..వేటగాళ్ల దుశ్చర్యలు ఆగడం లేదు. రాయిఘర్‌ సమితి టిమరపూర్‌ పంచాయతీ బినయపూర్‌ అటవీ ప్రాంతంలో వేటగాళ్లకు రెండు కోతులు బలైపోయాయి. ఫారెస్ట్‌ సిబ్బంది శుక్రవారం సాయంత్రం పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు వన్యప్రాణులను వేటాడుతూ కనిపించారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయారు. ఆ ప్రాంతంలో ఒక బ్యాగు, మోటారు బైక్‌ను విడిచిపెట్టి వెళ్లడంతో ఫారెస్ట్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగును పరిశీలించగా అందులో రెండు కోతుల కళేబరాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కేసు నమోదు చేశారు. వారి సూచనల మేరకు మృతి చెందిన కోతులకు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కోతి మాంసం విక్రయించేందుకే వాటిని చంపినట్లు ఫారెస్ట్‌ సిబ్బంది అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్‌ అధికారి శ్రీ దుక్కు తెలిపారు.

మరిన్ని వార్తలు