వీడని మిస్టరీ.. పోలీసులకే సవాల్‌గా మారిన కేసు

31 Jul, 2022 08:17 IST|Sakshi

తిరువళ్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు సంసారం చేశాడు. ఆ తరువాత వరకట్నం కోసం భార్యను వేధించాడు. అందుకు అంగీకరించకపోవడంతో భార్యను చిత్తూరు జిల్లా నారాయణవనం కైలాసకోనకు తీసుకెళ్లాడు. హతమార్చి మృతదేహం కనిపించకుండా మాయం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం ప్రాంతానికి చెందిన మదన్, తమిళ్‌సెల్వి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు సజావుగా సాగిన వీరి సంసారం, వరకట్నం వేధింపుల వైపు వెళ్లింది. వరకట్నం తేవాలంటూ మదన్‌ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గత జూన్‌ 25న తమిళ్‌సెల్వి మాయమైంది. దీంతో ఆందోళన చెందిన తమిళ్‌సెల్వి తల్లిదండ్రులు మణిగండన్, పల్గీస్‌ సెంగుడ్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అసిస్టెంట్‌ కమిషనర్‌ మురుగేషన్, ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తమిళ్‌ సెల్వి ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.  

కైలాసకోన వైపు కదిలిన కేసు 
విచారణలో భాగంగానే పోలీసులు మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. గత నెలలో తమిళ్‌సెల్వితో కలిసి చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసకోనలోని కొండపైకి వెళ్లానని, అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిపాడు. కోపంలో కత్తితో తమిళ్‌సెలి్వని దారుణంగా పొడిచానని, తీవ్రంగా గాయపడడంతో అక్కడే వదిలేసి ఇంటికి వచ్చినట్లు వెల్లడించాడు. తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు.   

ఆంధ్రాలో పోలీసుల దర్యాప్తు 
మదన్‌ ఇచ్చిన వాగ్మూలంతో సెంగుండ్రం పోలీసుల బృందం 20 రోజుల క్రితం కైలాసకోనకు వెళ్లింది. నారాయణవనం పోలీసుల సాయంతో కైలాసకోన కొండపై గాలించారు. ఫలితం కనిపించలేదు. అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కొండపైకి తమిళ్‌సెలి్వ, మదన్‌ జంటగా వెళ్లినట్టు నిర్ధారించారు. సుమారు రెండు గంటల తరువాత మదన్‌ ఒంటరిగా వచ్చినట్లు వీడియోలో రికార్డయింది. కానీ మృతదేహాం కనిపించకపోవడంతో విచారణలో పురోగతి కనిపించలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేసినా ఫలితం కనిపించలేదు. గత నెలలో మదన్‌ ఫోన్‌లో ఎక్కువ సార్లు మాట్లాడిన సంతోష్, బందారవిని సైతం విచారణ చేశారు. అయినా తమిళ్‌సెల్వి ఆచూకీ గుర్తించలేకపోయారు.  

ఇది కూడా చదవండి: గర్ల్‌ఫ్రెండ్ కోసం డబ్బులు కావాలని ఏటీఎం చోరికీ ప్లాన్‌..

మరిన్ని వార్తలు