అత్యంత చవకగా కార్బేవ్యాక్స్‌

6 Jun, 2021 06:13 IST|Sakshi

డోసుకు రూ. 200 లోపే!

బయోలాజికల్‌–ఇ ఉత్పాదన

హైదరాబాద్‌: భారత్‌లో అత్యంత చవకైన కోవిడ్‌–19 వ్యాక్సిన్స్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌–ఇ ఫార్మా కంపెనీ అందించనుంది. ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌ ‘కార్బేవ్యాక్స్‌’ ప్రతి డోసుకు రూ. 200.. ఇంకా అంతకంటే తక్కువ ఉండే అవకాశాలున్నాయి. కార్బేవ్యాక్స్‌ మొదటి, రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి కార్బేవ్యాక్స్‌కు అనుమతులు రావాల్సి ఉంది. రెండు డోసులకు కలిపి రూ.400 కంటే తక్కువ ధర ఉండొచ్చని బయోలాజికల్‌–ఇ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల ఒక ఇంటర్వ్యూలో సంకేతాలిచ్చారు. అయితే, అంతిమ ధరను ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేస్తున్న కోవిషీల్డ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.300 డోసు చొప్పున, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600కు డోసు చొప్పున విక్రయిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తమ కోవాగ్జిన్‌ను రాష్ట్రాలకు రూ.400కు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ,1200కు డోసు చొప్పున అమ్ముతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌–వీ టీకాను రెడ్డి ల్యాబ్స్‌ డోసుకు రూ.995కు విక్రయిస్తోంది.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్బోవ్యాక్స్‌ 30 కోట్ల డోసులను బుక్‌ చేసుకుంది. దీనికోసం బయోలాజికల్‌– ఇ సంస్థకు రూ.1,500 కోట్లు అడ్వాన్సుగా చెల్లించనుంది. ఆగస్టు నాటికి నెలకు 7.5 నుంచి 8 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల స్థితిలో ఉంటామని ఎండీ మహిమా దాట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు